
ఇద్దరు పిల్లలను చంపి, తండ్రి ఆత్మహత్య
కృష్ణరాజపురం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలను తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది, ఈ సంఘటనలో భర్త, ఇద్దరు పిల్లలు మరణించగా, భార్య ప్రాణాలతో బయటపడిన సంఘటన బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోసకోటె తాలూకాలోని గోణకనహళ్ళిలో జరిగింది. శివు (32), పిల్లలు చంద్రకళ (11), ఉదయ్‌సూర్య (7) మృతులు కాగా, శివు భార్య మంజుళ క్షేమంగా బయటపడింది, ఆమెను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
చున్నీతో గొంతు బిగించి..
వివరాలు.. కూలి పనులు చేసుకునే శివు కొంతకాలం కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఏ పనీ చేత కావడం లేదు. కుటుంబం గడవడానికి అప్పులు చేశాడు. తీర్చే మార్గం లేకపోవడంతో పాటు ఇంట్లో నిత్యం అనుమానంతో గొడవలు జరిగేవి. విరక్తి చెంది కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం దంపతులు మొదట ఇద్దరు పిల్లలను చున్నీతో గొంతుకు బిగించి ప్రాణాలు తీశారు, తరువాత భార్యభర్త ఉరి వేసుకున్నారు. ఇందులో భర్త చనిపోగా, తాడు తెగిపోవడంతో మంజుళ కిందపడి బతికిపోయింది. దీంతో భర్త ఫోన్ తీసుకుని తన తండ్రి కాల్ చేయాలనుకుంది, ఫోన్ లాక్ తెలియకపోవడంతో, పక్కింటికి వెళ్లి ఫోన్ తీసుకుని జరిగింది చెప్పసాగింది, తాను మళ్లీ ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి తెలిపింది. ఇదంతా వింటున్న పక్కింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన గురించి శివు సోదరి హోసకోటె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంజుళను విచారిస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఆత్మహత్యాయత్నం నుంచి
బయటపడిన తల్లి
బెంగళూరు రూరల్‌లో విషాద ఘటన

ఇద్దరు పిల్లలను చంపి, తండ్రి ఆత్మహత్య