
మహోన్నత విజ్ఞాని మోక్షగుండం
● ఆనకట్టలు, ప్రాజెక్టులు, డ్యామ్‌ల నిర్మాణంలో ప్రత్యేక ముద్ర
● ప్రపంచంలో అత్యున్నత ఇంజినీర్‌గా గుర్తింపు
● నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి
సాక్షి బళ్లారి: ఆనకట్టలు, ప్రాజెక్టులు, డ్యామ్‌ల నిర్మాణంలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. కష్టపడి చదివి అంచలంచెలుగా ఎదిగారు. కర్ణాటక రాష్ట్రమే కాకుండా యావత్తు దేశం, ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా ఎదిగారంటే ఆయన కృషి, పట్టుదల, దీక్ష దక్షతలకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. మోక్షగుండం పుట్టిన రోజును యావత్తు దేశం ఇంజినీర్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా ఆయన మేధాశక్తితో కట్టిన ఆనకట్టలు, ప్రాజెక్టులు, ఎన్నో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్లాన్లు ఇవ్వడంతో నేటికి కళ్లకు కట్టినట్లుగా మోక్షగుండం కనిపిస్తున్నారు. చిక్కబళ్లాపుర జిల్లా మద్దెనహళ్లి గ్రామంలో 1861 సెప్టెంబర్ 15న సామన్య కుటుంబంలో శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మి దంపతులకు జన్మించారు. అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామం కావడం విశేషం. కర్ణాటకలోని జన్మించడంతో విశ్వేశ్వరయ్య కర్ణాటక వాసిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 12వ ఏట తండ్రిని కోల్పోయిన మోక్షగుండం.. దుఃఖాన్ని దిగమింగుకుని బెంగళూరులో డిగ్రీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం పూణెలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తన మేధాశక్తికి పదును పెట్టి ముంబైలో అసిస్టెంట్ ఇంజినీరింగ్ బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్‌గా పదోన్నతి పొందారు. తన ప్రతిభతో ఎన్నో కట్టడాలకు రూపకల్పన చేయడంతో ఉన్నతస్థాయి అధికారుల మెప్పు పొందారు. సుఖనూరు బ్యారెజ్ నిర్మాణ పనులు అప్పగించడంతో అద్భుతంగా నిర్మాణం పూర్తి చేయడంతో మైసూరు ప్రభుత్వం చీఫ్ ఇంజినీర్‌గా నియమించింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో పేరుగాంచిన కేఆర్‌ఎస్ (కృష్ణ రాజసాగర) డ్యామ్ నిర్మాణ పనులు ఆయన హయాంలోనే పూర్తి చేశారు. కేఆర్‌ఎస్ డ్యామ్ నిర్మాణం తీర్చిదిద్దిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విశ్వేశ్వరయ్యకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. హైదరాబాద్‌లో అప్పట్లో వరదల కారణంగా మూసినది మునిగిపోవడంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. మూసి వరదల నుంచి రక్షించే బాధ్యతలను మోక్షగుండంకు అప్పగించారు. మూసి ఎగువున రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ, ప్రపంచ వ్యాప్తంగా పలు ఆనకట్టలు, ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టి ఎంతో ఖ్యాతిని పొందారు. దేశాభివృద్ధికి మోక్షగుండం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం1955లో భారతరత్న అవార్డు ప్రకటించింది.
నేడు ప్రత్యేక కార్యక్రమాలు..
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మస్థలమైనా ముద్దెనహళ్లిలో ఇంజినీర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున నివాళులర్పించనున్నారు. కర్ణాటకలోని అన్ని జిల్లాలకు చెందిన ఇంజినీర్స్ నిపుణులు హాజరవుతున్నారు. కేపీసీఈఎస్‌సీ సభ్యుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని కర్ణాటక ఆర్కిటెక్ట్, ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ ప్రసాద్ కేబీ తెలిపారు.

మహోన్నత విజ్ఞాని మోక్షగుండం

మహోన్నత విజ్ఞాని మోక్షగుండం