
ఇంటింటా కన్నీటి ఘోష
యశవంతపుర: హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా మోసళె హోసహళ్లి వద్ద శుక్రవారం రాత్రి లారీ దూసుకెళ్లిన ఘటనలో శనివారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు మరణించాడు. మొత్తం మృతుల సంఖ్య 10 కి పెరిగింది. స్థానిక శివయ్య కొప్పలుకు చెందిన చందన్ (28) లారీ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స ఫలించక ప్రాణాలు వదిలాడు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న చందన్ అవివాహితుడు, కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి చందనే ఆధారం. మృతుల ఇళ్లలో రోదనల ఘోష మిన్నంటుతోంది. ఇంతవరకు ముఖ్యమంత్రితో సహా అధికార ప్రముఖులు బాధితుల వైపు తిరిగి చూడనేలేదని విమర్శలున్నాయి.
దేవేగౌడ పరామర్శ
జేడీఎస్ అధినేత దేవేగౌడ పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఉదయం మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి రూ. లక్ష చొప్పున పరిహారాన్ని అందజేశారు. పోలీసులు ముందు జాగ్రత్తలను తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సాయాన్ని అందజేసి సాంత్వన పలికారు. మిగిలిన పిల్లల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు.
అంత్యక్రియలు
హొళెనరసీపుర తాలూకా డనాయకనహళ్లి కొప్పలుకు చెందిన ఈశ్వర్ అనే ఇంటర్ బైపీసీ విద్యార్థి అంత్యక్రియలు జరిగాయి. తండ్రి రవికుమార్ ఆటో నడుపుతూ కొడుకును మంచి చదువులను చదివించాలని కష్టపడుతున్నారు. పుత్రుని మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.
బెంగళూరుకు లారీడ్రైవర్ తరలింపు
నిర్లక్ష్యంగా లారీ నడిపి 10 మంది మృతికి, 20 మంది గాయపడడానికి కారకుడైన లారీ డ్రైవర్ భువనేశ్‌ని స్థానికులు చితకబాదడం తెలిసిందే. అతనికి గాయాలు కావడంతో బెళ్లూరు బీజీఎస్ ఆస్పత్రిలో చేర్పించారు, శనివారం మధ్యాహ్నం డిశ్చార్జి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టాలనుకున్నారు, అయితే కడుపు, ఎదలో నొప్పిగా ఉందని నిందితుడు చెప్పడంతో మెరుగైన చికిత్సల కోసం బెంగళూరుకు తరలించారు. డ్రైవర్ మద్యం తాగి లారీని నడిపినట్లు ఆరోపణలు రావడంతో అతని రక్త నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపారు.
హాసన్ దుర్ఘటనలో బాధితుల ఆక్రోశం

ఇంటింటా కన్నీటి ఘోష