
అత్తిబెలి రోడ్డంటే బెంబేలు
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలో ఉన్న అత్తిబెలి మెయిన్ రోడ్డు, ఆనేకల్ రోడ్డు, బళ్లూరు రోడ్డు.. ఇలా ఏ దారి చూసినా పెద్ద పెద్ద గుంతలు తేలి బైకిస్టులు, ఇతర వాహనదారులకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. గుంతలను తప్పించాలని వాహనదారులు సర్కస్ విన్యాసాలు చేయవలసి వస్తోంది. దీంతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వానలు వస్తే గుంతల్లో నీళ్లు చేరి ఎక్కడ గొయ్యి ఉందో తెలియక మరింత అయోమయానికి గురవుతున్నారు. మామూలు రోజుల్లో కంకర తేలి దుమ్ము ధూళి వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
3 కి.మీ.కి అర్ధగంట
ఈ మార్గంలో వాహనదారులు 3 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి అర్ధగంట పైనే పడుతోందని వాపోయారు. ముఖ్యంగా అత్తిబెలి, ఆనేకల్ రోడ్డు, అత్తిబెలి– బళ్లూరు మార్గంలో సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు తారు లేచిపోయింది, కంకర రాళ్లు, గుంతలు కనిపిస్తాయి. దుమ్ముధూళి నిండి ప్రజలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. దాంతో అత్తిబెలికి ఆనేకల్, బళ్లూరు నుంచి వచ్చే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మట్టికరవడం ఖాయమని వాపోయారు. ఆనేకల్ తాలూకాలోని అత్తిబెలె.. తమిళనాడులోని హోసూరుకు కూతవేటు దూరంలో ఉంటుంది. హోసూరులోని పరిశ్రమలకు నిత్యం వేలాది మంది కార్మికులు, యువకులు ఇదే రహదారిలో వెళ్తూ ఉంటారు. గుంతల వల్ల సమయం వృథా అవుతోందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రహదారిని బాగుచేసి పుణ్యం కట్టుకోవాలని డిమాండ్ చేశారు.
రోడ్ల అధ్వాన్నంపై బాలిక ఆక్రోశం
బనశంకరి: బెంగళూరు నగరరోడ్ల దుస్థితి, గుంతల రోడ్లు, అస్తవ్యస్తమైన ఫుట్‌పాత్ మార్గాల గురించి నగరవాసులు తరచూ సోషల్ మీడియా ద్వారా ఆక్రోశిస్తుంటారు. పాఠశాల విద్యార్థులు కూడా ఇందులో చేరారు. బస్‌లో కూర్చుని సెల్ఫీ వీడియో తీసి అయ్యో బెంగళూరు రోడ్డు, ట్రాఫిక్ జామ్.. చాలాభయం వేస్తుంది, రోడ్డు గుంతల్లో చిక్కుకున్నాం అని ఓ బాలిక తెలిపింది. గుంతల రోడ్లు, ట్రాఫిక్ సమస్య వల్ల పాఠశాలకు సక్రమంగా వెళ్లలేకపోతున్నామని ఫిర్యాదు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. బీజేపీ నేతలు ఎక్స్‌లో షేర్ చేసి డీసీఎం డీకే.శివకుమార్, రాహుల్‌గాంధీ.. మీరు చెప్పిన బ్రాండ్ బెంగళూరు ఇదేనా అని ప్రశ్నించారు.
గుంతలు తేలి జనం అవస్థలు
బెంగళూరు పరిధిలోనే తీవ్ర దుస్థితి

అత్తిబెలి రోడ్డంటే బెంబేలు

అత్తిబెలి రోడ్డంటే బెంబేలు