
బ్యాంక్ అభివృద్ధికి దోహదపడాలి
చెళ్లకెరె రూరల్: 2025–26 ఆర్థిక సంవత్సరంలో చెళ్లకెరె హొసళ కో–ఆపరేటివ్ సొసైటీ రూ.5.63 లక్షల లాభాలు గడించి ప్రగతి బాటలో నడుస్తోందని బ్యాంక్ అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బి.సుధాకర్ తెలిపారు. ఆదివారం బ్యాంక్ ఆవరణలో 22వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ నిరంతరం లాభాల బాటలో నడుస్తున్నందున సభ్యులకు 25 శాతం డివిడెండ్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులు వ్యాపార వ్యవహరాల కోసం రుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు. బ్యాంక్ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. లాభాల్లో కొంత మొత్తాన్ని ప్రజల ఆరోగ్యం, పేద విద్యార్థుల విద్యకు కేటాయిస్తామన్నారు. బ్యాంక్ జనరల్ మేనేజర్ వీరేష్ హల్లేరా బ్యాంక్ వ్యవహరాలను సభలో ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్‌కే మరళి, ప్రహ్లాద్, టి.వీరభద్ర బాబు, ఎస్‌ఎం రవి, సిద్దార్థ, నేరలగుంట రామప్ప, బ్యాంక్ సిబ్బంది, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో రాణించాలి
రాయచూరు రూరల్: ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని హైదరాబాద్ కర్ణాటక విద్యాసంస్థల పాలక మండళి సభ్యుడు అరుణ్ కుమార్ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం కలబుర్గి వీరమ్మ గంగ సిరి మహిళా కళాశాలో విద్యార్థుల సంఘాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కళాశాలలో చదివిన విద్యార్థిని శ్రీదేవి కల్యాణి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన అందించాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ సంచాలకుడు నాగణ్ణ, అనిల్ కుమార్, ప్రిన్సిపాల్ రాజేంద్ర కొండా, మహేష్ గంవార్ తదితరులు పాల్గొన్నారు.

బ్యాంక్ అభివృద్ధికి దోహదపడాలి