
డ్రగ్ పెడ్లర్‌గా జైలు వార్డర్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో సిబ్బంది కుమ్మక్కు మరోసారి బయటపడింది. ఖైదీలకు పొగాకు, మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న జైలు వార్డర్ కళ్లప్పను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 100 గ్రాముల హషిష్ ఆయిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. 2018లో కళ్లప్ప ఉద్యోగంలో చేరాడు. 7వ తేదీన సాయంత్రం తనిఖీ సిబ్బంది కళ్లప్పను ఎంట్రీ గేటు వద్ద చెక్ చేయగా పొగాకు, హషిష్ ఆయిల్ లభించాయి. ఖైదీలకు సరఫరా చేసి, పెద్దమొత్తంలో డబ్బులు గుంజేవాడినని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
భర్త చేతిలో భార్య హతం
దొడ్డబళ్లాపురం: తాగిన మత్తులో భర్త, భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన హాసన్ జిల్లా చన్నరాయపట్టణ హిరిసావె గ్రామంలో జరిగింది. వివరాలు.. రేఖ (38), రఘు (40)కు 18 సంవత్సరాల క్రితం పెళ్లయింది. రఘు మద్యానికి బానిసై నిత్యం తాగివచ్చి భార్యతో గొడవపడేవాడు. బుధవారం సాయంత్రం ఇద్దరు పిల్లలు ట్యూషన్‌కి వెళ్లిన సమయంలో రగడకు దిగాడు, కై పులో కత్తి తీసుకుని భార్యను పొడిచి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు హంతకుని కోసం శోధిస్తున్నారు.
బిల్ కలెక్టర్, కొడుకు దాడి..
● దళితుని నరికివేత
తుమకూరు: తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని దళిత సముదాయంవారు కోరగా, వారితో గొడవ పడిన పంచాయతీ బిల్ కలెక్టర్, పంచాయతీ సభ్యడు కలిసి ఒకరిని హత్య చేశారు. ఈ దురాగతం హోంమంత్రి సొంత జిల్లా తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలోని పోలెహళ్ళి గ్రామంలో జరిగింది. ఆనంద్ (40) హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన బిల్ కలెక్టర్ రామకృష్ణప్ప, అతని కుమారుడు, గ్రామ పంచాయతీ సభ్యుడైన నాగేష్, నాగమణి కొడవలితో నరికి బొలెరో తొక్కించి భయానకంగా చంపారు. గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని, తమకు నీటి వసతి కల్పించాలని ఆనంద్ డిమాండ్ చేసేవాడు, గ్రామ పంచాయతీ ద్వారా బోరువేసి నీరివ్వాలని బిల్ కలెక్టర్‌ను కోరేవాడు. దీంతో అతని మీద కక్ష పెంచుకున్నారు. గురువారం గ్రామంలో రామకృష్ణ, అతని కుమారుడు నాగేష్, నాగమణి అనే మహిళ కలిసి ఆనంద్ మీద వేట కొడవలితో దాడి చేశారు. రోడ్డు మీదే నరికి, ఆపై బొలెరోతో తొక్కించారు. బాధితుడు నిమిషాల్లోనే మరణించాడు. గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది, అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటైంది.

డ్రగ్ పెడ్లర్‌గా జైలు వార్డర్