
దర్శకుని ఇంట రచ్చ
శివాజీనగర: ఇంటింటి కథలను వెండితెరపై చూపే దర్శకుని ఇంటి కథ రచ్చకెక్కింది. కోడలిని కట్నం కోసం వేధించారని ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు ఎస్.నారాయణ, కుటుంబం మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బెంగళూరులొని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో నారాయణ, భాగ్యవతి, భర్త పవన్ మీద కోడలు పవిత్ర ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం.. 2021లో ఇద్దరికీ పెళ్లయింది. వివాహ సమయంలో బాగానే కట్నకానుకలు ఇచ్చారు. కానీ మరింత డబ్బు బంగారం తేవాలని సతాయిస్తున్నారు. భర్త పవన్ ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటాడు. ఆర్థిక ఇబ్బందులు రావడంతో పవిత్రనే ఉద్యోగం చేస్తోంది. పవిత్ర తల్లి బంగారు నగలను కుదవ పెట్టి కొంత సొమ్ముఇచ్చింది. దానిని భర్త పోగొట్టాడు. ఆ తరువాత పవిత్రనే రూ. 10 లక్షలు అప్పుచేసి భర్తకు ఇచ్చింది. చివరకు వేధించి, కొట్టి, తనను ఇంటి నుంచి గెంటివేశారని పవిత్ర వాపోయింది.
ఆరోపణలు సాధారణమే
నారాయణ స్పందిస్తూ ఏడాది కిందట కోడలు మా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మనదేశంలో కట్న వేధింపులు అని అందరు మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు కదా అన్నారు. తాము మాట్లాడితే ఆమెకు అవమానం అవుతుందని, అందుకే మౌనంగా ఉన్నట్లు చెప్పారు. ఆమెకు సుఖం, సంతోషం ఎక్కడ లభిస్తుందో అక్కడికి వెళ్లారు, ఆమె వ్యక్తిత్వం అందరికీ తెలుసు అని హేళన చేశారు.
కట్నం వేధింపుల కేసు పెట్టిన కోడలు