
ప్రైవేటు బస్సులో డ్రైవర్ అకృత్యం
శివాజీనగర: బస్సులో ఒంటరిగా ప్రయాణించిన బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక డ్రైవర్‌కు బాలిక కుటుంబీకులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున బెంగళూరులో బసవేశ్వర సర్కిల్‌లో జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రైవేటు స్లీపర్ బస్సు బయల్దేరింది. అందులో ఓ బాలిక (15) బెంగళూరుకు వస్తోంది. మొబైల్‌ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో చార్జింగ్ చేయాలని డ్రైవర్‌ను కోరింది. కొంతసేపటి తరువాత బాలిక మొబైల్ ఇవ్వాలని అడిగితే, ముద్దివ్వాలని డ్రైవర్ అరిఫ్ (41) బాలికను ఒత్తిడి చేశాడు. తరువాత బాలిక తన సీటు వద్దకు వెళ్లి నిద్రపోయింది, డ్రైవర్ బాలిక వద్దకు వెళ్లి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది తట్టుకోలేక బాలిక తల్లికి ఫోన్ చేసి చెప్పింది. బస్సు సిటీకి రాగానే బాలిక తల్లి, సోదరుడు నిలిపి డ్రైవర్ అరిఫ్‌ను ప్రశ్నించారు. డ్రైవర్ తప్పయిపోయిందంటూ చేతులెత్తి మొక్కి వేడుకున్నాడు. బాలిక కుటుంబీకులు అతని బట్టలను విప్పి చితకబాదారు. ఇంతలో పోలీసులు చేరుకొని వారిని అడ్డుకొని డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్ ఆమెను తీవ్రంగా సతాయించాడని, అతనిని వదిలిపెట్టేది లేదని స్పష్టంచేసింది.
ఒంటరి బాలికపై లైంగిక వేధింపులు
దేహశుద్ధి చేసిన కుటుంబీకులు