అన్నభాగ్య బియ్యానికి రెక్కలు | - | Sakshi
Sakshi News home page

అన్నభాగ్య బియ్యానికి రెక్కలు

Sep 11 2025 10:18 AM | Updated on Sep 11 2025 10:18 AM

అన్నభ

అన్నభాగ్య బియ్యానికి రెక్కలు

సాక్షి బళ్లారి: అన్నభాగ్య బియ్యం ప్రస్తుతం రేషన్‌ షాపుల నుంచి, కార్డు దారుల నుంచి దేశ విదేశాలకు అక్రమంగా సరఫరా అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఉత్తర కర్ణాటక పరిధిలో యాదగిరి జిల్లాతో పాటు బళ్లారి, రాయచూరు, కొప్పళ, గదగ్‌ తదితర జిల్లాల్లో రేషన్‌ బియ్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట పట్టుపడుతుండటం అక్రమంగా రేషన్‌ బియ్యం సరఫరా అవుతోందనడానికి సాక్ష్యంగా నిలుస్తోంది. యాదగిరి జిల్లాలో దాదాపు 4 వేల క్వింటాళ్ల అక్రమ రేషన్‌ బియ్యాన్ని పట్టుకోవడంతో పాటు రెండు లారీలు సీజ్‌ చేయడం, నలుగురు ట్రేడింగ్‌ కంపెనీల యజమానులపై కేసులు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేషన్‌ బియ్యం ప్రతి నెల, ఒక్కొక్క కార్డు లబ్ధిదారుడికి 8 కేజీల చొప్పున సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు రెండు కేజీల జొన్నలు కూడా రేషన్‌ కార్డు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి సోనామసూరి బియ్యం కంటే మెరుగ్గా నిగనిగలాడే విధంగా తయారు చేసి ఎగుమతి చేస్తుండటం వెలుగులోకి వచ్చింది.

పేదల నుంచి తక్కువ ధరకే కొనుగోలు

లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకే కిలో రూ.8 లేదా రూ.10లకే కొనుగోలు చేసి వాటికి పాలిష్‌ చేసి బియ్యం సంచులకు కూడా కొత్త రకం బ్రాండ్లు పెట్టి వెలుగులోకి రావడంపై యాదగిరి జిల్లాలో గురుమఠకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర, శ్రీలక్ష్మీద బాలాజీ ఇండస్ట్రీస్‌ తదితర కంపెనీలపై అధికారులు మెరుపుదాడి చేసి రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి సోనామసూరి బియ్యం కంటే తెల్లగా ఉండేలా తయారు చేసి ప్రత్యేక బ్య్రాండ్లతో ఎగుమతి చేస్తుండటంపై అధికారులు సంబంధిత వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక్క యాదగిరి జిల్లాలోనే కాకుండా ఈ అక్రమ బియ్యం ఎగుమతి చేస్తుండటం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొనసాగుతోందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కార్డు లబ్ధిదారుడికి 5 కేజీల నుంచి 10 కేజీల బియ్యాన్ని పెంచిన సంగతి తెలిసిందే.

మాయమాటలు చెప్పి మోసగిస్తూ..

పేదల కడుపు నింపాల్సిన ఈ బియ్యాన్ని తినడానికి పనికి రావని కొందరు డీలర్లు మాయమాటలు చెప్పి ప్రతి నెల డబ్బులు ఇస్తామని తమకే బియ్యాన్ని ఇవ్వాలని చెబుతూ లబ్ధిదారుల నుంచి నేరుగా తీసుకుని పాలిష్‌ చేసే రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యానికి మరింత మెరుగులు దిద్ది కొత్త బ్రాండ్లలోకి మార్చి అధిక ధరలకు బియ్యం అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో కర్ణాటక అన్నభాగ్య రేషన్‌ బియ్యానికి 25 కేజీల ప్యాకెట్‌ను ఏకంగా రూ.7 వేలకు పైగా విక్రయాలు సాగిస్తున్నారు. అక్రమంగా సేకరించిన ఈ బియ్యం ఆర్గానిక్‌ అని చెబుతూ బహిరంగ మార్కెట్‌లో ఉన్నదాని కంటే ధర పెంచి సొమ్ము చేసుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా వివిధ జిల్లాల నుంచి రేషన్‌ బియ్యం డీలర్ల నుంచి, కార్డు లబ్దిదారుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి అక్రమంగా సరఫరా చేస్తున్నప్పటికీ తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారే కానీ ప్రతి నెల రేషన్‌ డీలర్ల నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని కట్టడి చేయకపోవడంతో పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతూనే ఉంది.

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం బస్తాలు

పాలిష్‌ చేసిన తర్వాత వివిధ బ్రాండ్లతో సిద్ధం చేసిన బియ్యం ప్యాకెట్లు

యథేచ్ఛగా దేశ విదేశాలకు అక్రమ సరఫరా

పాలిష్‌ చేసి ప్రత్యేక బ్రాండ్లతో దేశ,

విదేశాలకు ఎగుమతి

పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్న వైనం

ఒక్కొక్క కుటుంబంలో నలుగురు లేదా ఐదు మంది ఉంటే ఆ కుటుంబానికి 40 కేజీల నుంచి 50 కేజీల వరకు రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం లబ్ధిదారులకు ప్రతి నెల సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ ఆ బియ్యం పేదలు నిజంగా ఉపయోగిస్తున్నారా లేదా అక్రమంగా రేషన్‌ షాపు డీలర్లు, సంబంధిత ఉన్నతాధికారులు కలిసి కట్టుగా కుమ్మకై ్క రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారా? అన్నది కూడా పట్టించుకోకపోవడంతో రేషన్‌ బియ్యం యథేచ్ఛగా దేశ విదేశాలకు అక్రమంగా సరఫరా అవుతుండటం గమనార్హం. విమానాల్లో, సముద్ర మార్గం గుండా కూడా ఎగుమతులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ముంబై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో పాటు అక్కడి నుంచి సింగపూర్‌, అరబ్‌ దేశాలకు రేషన్‌ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. దీంతో కర్ణాటక నుంచి అన్నభాగ్య రేషన్‌ బియ్యం పెద్ద స్థాయిలో అక్రమంగా బియ్యం వ్యాపారం చేసే దళారీల వద్ద రూ.కోట్లాది మేర చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.

అన్నభాగ్య బియ్యానికి రెక్కలు1
1/1

అన్నభాగ్య బియ్యానికి రెక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement