బాలికపై వీధికుక్కల దాడి | - | Sakshi
Sakshi News home page

బాలికపై వీధికుక్కల దాడి

Sep 7 2025 7:17 AM | Updated on Sep 7 2025 7:17 AM

బాలిక

బాలికపై వీధికుక్కల దాడి

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో కుక్కల దాడులు పెరిగిపోయాయి. ప్రశాంతంగా రోడ్డు మీద కూడా వెళ్లే అవకాశం ఇవ్వడం లేదు. బాలికపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన బెంగళూరు రూరల్‌లోని హొసకోటలో చోటుచేసుకుంది. గోకుల్‌ డైరీ రోడ్డు వద్ద బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా ఐదు వీధికుక్కలు దాడి చేసి కరిశాయి. బాలిక భయాందోళనతో కేకలు వేసింది. స్థానికులు కుక్కల్ని తరిమికొట్టి బాలికను కాపాడరు. అయితే ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పట్టణంలో కుక్కల గోల విపరీతంగా ఉందని, మున్సిపల్‌ అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

ప్రేమ కోసమని కత్తులతో బాలల రగడ

దొడ్డబళ్లాపురం: ఒక బాలికతో ప్రేమ వ్యవహారంలో ఇద్దరు బాలురు ఘర్షణపడ్డ సంఘటన బెళగావిలో జరిగింది. బెళగావి పట్టణంలోని రాయల్‌ స్కూల్‌ వద్ద ఇద్దరు బాలలు తామిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నామని వాగ్వాదానికి దిగి కొట్టుకున్నారు. పైగా పరస్పరం కత్తులతో పొడుకున్నారు. వీరి గొడవలో తలదూర్చిన మరో ఇద్దరు మైనర్లు కూడా గాయపడ్డారు. ఓ బాలున్ని బిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా, మరొకరిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బెళగావి ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలల పెడధోరణిని చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.

చిన్నారిని చిదిమిన స్కూల్‌ బస్సు

దొడ్డబళ్లాపురం: స్కూల్‌ బస్సు దిగుతుండగా డ్రైవరు బస్సును నడపడంతో బాలిక బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన బీదర్‌ జిల్లా ఔరాద్‌ తాలూకా ఎక్కంబా గ్రామంలో జరిగింది. కావేరి ఆకాశ్‌ (6) మృతురాలు. కావేరిని ఇంటి వద్ద స్కూల్‌ బస్సు దిగుతుండగా బాలిక లోపే డ్రైవర్‌ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో చిన్నారి కిందకు పడిపోగా, బస్సు చక్రాలు ఆమె మీద నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాలైన బాలిక అక్కడే కన్నుమూసింది. స్కూలు నుంచి తిరిగి వస్తుందని చూసిన తల్లిదండ్రులు విగతజీవిగా మారిన కూతురిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. బస్సు డ్రైవర్‌పై ఔరాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు.

పాము కాటుకు

మహిళా రైతు బలి

దొడ్డబళ్లాపురం: సర్పం కాటువేయడంతో మహిళా రైతు అసువులు బాసిన సంఘటన కనకపుర తాలూకా హలసూరు గ్రామంలో జరిగింది. గ్రామవాసి శోభ (43) మృతురాలు. ఈమె శుక్రవారం తమ పొలంలో టమాటా చెట్ల నుంచి కాయలు కోస్తూ ఉండగా చెట్ల మధ్య ఉన్న పాము కాటువేసింది. 20 నిమిషాల్లోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు సాతనూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించి కనకపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మరణించింది.

కాంట్రాక్టరుకు

రూ.18 లక్షల మస్కా

మైసూరు: షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చనే ఆశతో విద్యుత్‌ కాంట్రాక్టర్‌కు సైబర్‌ నేరగాళ్లు రూ.18.42 లక్షలను టోపీ వేశారు. మైసూరులోని విశ్వేశ్వరయ్యనగర నివాసి అయిన విద్యుత్‌ కాంట్రాక్టర్‌కు వాట్సాప్‌ ద్వారా సందేశం పంపిన దుండగులు షేర్‌ మార్కెట్‌ గురించి వివరించారు. డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆశ పుట్టించారు. వారి మాటలను నమ్మిన కాంట్రాక్టర్‌ దశల వారీగా రూ.18.42 లక్షలను దుండగులు చెప్పిన ఖాతాకు బదిలీ చేసి మోసపోయాడు. వంచనను గ్రహించి సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

పెళ్లి రద్దు.. కాంట్రాక్టు

ఉద్యోగిని ఆత్మహత్య

మండ్య: ఇటీవలే నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లయి సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతి.. ప్రాణాలు తీసుకుంది. పెళ్లి రద్దు కావడమే దీనికి కారణం. మండ్య జిల్లాలోని కేఆర్‌పేటె తాలూకాలోని కిక్కేరిలో ఈ విషాదం జరిగింది. వివరాలు.. స్థానిక వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిని కావ్య (28)కు, 15 రోజుల క్రితం హాసన్‌కు చెందిన కరణ్‌ అనే యువకునితో పెద్దలు నిశ్చితార్థం జరిపించారు. కరణ్‌ డిగ్రీ పూర్తి చేసి ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. యువతి కుటుంబీకుల పరిశీలనలో ఇది అబద్ధమని తేలింది. దాంతో పనీపాటా లేని వ్యక్తితో పెళ్లి వద్దని కావ్య తండ్రి తేల్చిచెప్పాడు. మరోవైపు పెళ్లి ఖరారైందని స్నేహితులకు, సహోద్యోగులకు చెప్పుకొన్న కావ్య ఈ పరిణామంతో విరక్తి చెందింది, 4వ తేదీన కిక్కేరిలో వ్యవసాయ ఆఫీసులో పురుగుల మందు తాగిపడిపోయింది. సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి బిజీఎస్‌ ఆస్పత్రికి తరలించగా ఆమె శనివారం కన్నుమూసింది. పెళ్లి వాయిద్యాలు మోగాల్సిన ఇంట విషాదం తాండవించింది.

బాలికపై వీధికుక్కల దాడి  1
1/2

బాలికపై వీధికుక్కల దాడి

బాలికపై వీధికుక్కల దాడి  2
2/2

బాలికపై వీధికుక్కల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement