
అతిథి అధ్యాపకులను నియమించండి
హొసపేటె: ప్రభుత్వ శంకర్ ఆనంద్‌సింగ్ కళాశాలలో వెంటనే అతిథి ఉపన్యాసకులను నియమించాలని డిమాండ్ చేస్తూ ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో గురువారం కళాశాల ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఏఐడీఎస్‌ఓ విజయనగర జిల్లా సమన్వయకర్త రవికిరణ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కోర్సుల తరగతులు ప్రారంభమై నెల రోజులు గడిచినా కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లు లేరన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు గెస్ట్ లెక్చరర్లపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు తరగతులు సరిగ్గా నిర్వహించడం లేదు. ఇది విద్యార్థులను చాలా ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇది వారి విద్యా భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేస్తోందన్నారు. డిగ్రీ విద్యార్థుల మొదటి అంతర్గత పరీక్షలు వచ్చే నెలలో జరగాల్సి ఉండగా తరగతులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఇటువంటి పరిస్థితిలో విద్యాభ్యాసం సజావుగా సాగేలా, గందరగోళాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.