
పరిహారం కోసం రైతులు కోర్టుకు వెళ్లొద్దు
సాక్షి, బళ్లారి: కృష్ణా ప్రాజెక్ట్‌లకు సంబంధించి మూడవ దశ పనులకు వారంలోపు సమావేశం నిర్వహించి రైతులకు పరిహారం అందజేస్తామని, ఏ ఒక్క రైతు కోర్టుకు వెళ్లకూడదని, అలా జరిగితే పరిహారం అందించేందుకు ఆలస్యం అవుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన విజయపుర జిల్లాలో ఆల్మట్టి డ్యాంకు ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌తో కలిసి వాయనం సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా పథకానికి సంబంధించి రైతు నాయకుల పోరాటంతో గతంలో బెళగావిపై అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చ జరిగిందన్నారు.
అందరి ఏకాభిప్రాయంతో నిర్ణయం
అక్కడ అందరూ ఒప్పుకున్నారని, ప్రభుత్వం కూడా రైతుల డిమాండ్లను అంగీకరించిందన్నారు. ఉపముఖ్యమంత్రి కూడా ఈ ప్రాంత రైతులు, ఎమ్మెల్యేలతో చర్చించారని, అందరి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చామని గుర్తు చేశారు. కృష్ణా నదిపై నిర్మించిన అల్మట్టి డ్యాం ఎత్తును మూడో దశలో 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచడం వల్ల 130 టీఎంసీల నీటిని ఉపయోగించుకొనేందుకు వీలవుతుందన్నారు. అలాగే 173 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలని తీర్మానించడానికి యోచిస్తున్నామన్నారు. నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ప్రధాని, కేంద్ర మంత్రులతో డీసీఎం చర్యలు
ఆల్మట్టి ఎత్తు పెంపుపై సంబంధించి కేంద్ర మంత్రి, ప్రధానమంత్రులతో కూడా ఉపముఖ్యమంత్రి కలిసి చర్చించారన్నారు. రైతులకు మేలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడతామన్నారు. 2025–26వ సంవత్సర బడ్జెట్‌లో బాగలకోటె, మంగళూరు, కోలారు తదితర జిల్లాల్లో మెడికల్ కాలేజీలను స్థాపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ స్థాపించి మరిన్ని వైద్య సీట్లు భర్తీ చేస్తామన్నారు.
బాను ముస్తాక్ చేతుల మీదుగా
దసరా ఉత్సవాలు ప్రారంభం
దసరా ఉత్సవాలను బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముస్తాక్ చేతుల మీదుగానే నిర్ణీత తేదీల్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ వ్యతిరేకించడం సరికాదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో వ్యతిరేకించడం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు పరిహారం అందజేస్తాం
ఆల్మట్టి డ్యాం వద్ద ముఖ్యమంత్రి సిద్దరామయ్య

పరిహారం కోసం రైతులు కోర్టుకు వెళ్లొద్దు