
మహనీయుల సిద్ధాంతాలు అనుసరణీయం
సాక్షి,బళ్లారి: మహనీయుల తత్వ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని వీరశైవ సమాజ ప్రముఖులు అన్నారు. శనివారం నగరంలోని అల్లం సుమంగళమ్మ మహిళా విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ పండితారాధ్య శివాచార్య మాట్లాడుతూ విద్యార్థులతో ముఖాముఖి సంవాదం చేశారు. 12వ శతాబ్ధంలో జన్మించిన బసవణ్ణ ఒక వ్యక్తి కాదు శక్తి అని, ఆయన నడిచిన దారి, చూపిన మార్గం యావత్ ప్రపంచం అనుసరిస్తోందన్నారు. భాల్కి హిరేమఠ బసవలింగ పట్టెద స్వామీజీ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం బసవణ్ణ ఆదర్శాలు, తత్వసిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఉరవకొండ కరిబసవ రాజేంద్ర స్వామి, సండూరు విరక్తమఠం ప్రభుస్వామి, వీరశైవ సమాజ ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు బసవ సంస్కృతి అభియాన్ ఉత్సవ రథానికి నగరంలో ఘనస్వాగతం పలికారు. మోకా రోడ్డులోని కేఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్ నుంచి బసవ సంస్కృతి ఉత్సవ రథాన్ని వీరశైవ సమాజ ప్రముఖులు పాల్గొని స్వాగతించారు. విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్, వీరశైవ సమాజ ప్రముఖులు మీనళ్లి చంద్రశేఖర్, తిమ్మనగౌడ, అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొని రథోత్సవంలో ఉంచిన బసవణ్ణ చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా, ద్విచక్ర వాహనాల్లో పెద్ద సంఖ్యలో వీరశైవ సమాజ ప్రజలు పాల్గొని ర్యాలీ నిర్వహించారు.

మహనీయుల సిద్ధాంతాలు అనుసరణీయం