
పరువు నష్టం దావాలకు భయపడను
సాక్షి,బళ్లారి: బెదిరింపులకు తాను భయపడేది లేదని, నిజాలు ఉంటేనే మాట్లాడతానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ, వ్యాపార జీవితంలో ఈ నమ్మ కన్నడ నాడు పత్రిక పెట్టినప్పుడు, అనంతరం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో పరువు నష్టం దావాలు ఎదుర్కొన్నానన్నారు. మహామహులపై కూడా ఆధారాలతో సహా మాట్లాడినప్పుడు తనపై పరువునష్టం దావా కేసులు వేశారన్నారు. అలాంటి సందర్భంలో కూడా తాను భయపడలేదన్నారు. ఽప్రస్తుతం తమిళనాడుకు చెందిన లోక్‌సభ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కూడా పరువు నష్టం దావా కేసు వేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. కోట్లాది మంది పూజించే, కర్ణాటకలోనే కాకుండా యావత్ దేశం, ప్రపంచంలోనే భక్తులను కూడగట్టుకున్న సాక్షాత్తు శివుడు కొలువు దీరిన ధర్మస్థలపై కుట్రలు చేయడాన్ని తాను సహించబోనన్నారు.
మతానికి మచ్చ తేవాలని చూస్తున్నారు
హిందూ మతానికి మాయని మచ్చ తేవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ధర్మస్థలకు వెళ్లే భక్తులు, ప్రజలను భయపెట్టాలని ప్రయత్నించిన వారి కుట్రలు బహిర్గతం అయ్యాయన్నారు. అయితే వారి కుట్రల వెనుక ఎవరు ఉన్నారో బయటకు రావాలని పోరాటం చేస్తుమన్నారు. కర్ణాటకలో పలు జిల్లాల్లో జిల్లాధికారిగా పని చేసిన సెంథిల్ ఇక్కడ రాజీనామా చేసి అక్కడ రాజకీయాల్లోకి వెళ్లారన్నారు. తమిళనాడు నుంచి లోక్‌సభ సభ్యుడుగా గెలుపొందారన్నారు. ధర్మస్థలపై కుట్రల వెనుక సెంథిల్ హస్తం ఉందనే ఆరోపణలు నూటికి నూరుపాళ్లు నిజం అని గుర్తు చేశారు. సిట్ ద్వారా కాకుండా సీబీఐ, ఎన్‌ఐఏ ద్వారా సమగ్ర దర్యాప్తు చేపడితే ముసుగు వీరులు బయటకు వస్తారన్నారు. సెంథిల్‌కు నిజంగా నిజాయితీ ఉంటే తనపై పరువు నష్టం దావా కేసు వేసే బదులు సీఎం, డీసీఎంలను కలిసి ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరి ఉంటే బాగుండేదన్నారు. అప్పుడే ఆయన నిజాయితీ బయట పడేదన్నారు.
సోనియా, రాహుల్ కూడా బెయిల్‌పై ఉన్నారు
అలాంటిదిపోయి నిజాలు, వాస్తవాలు మాట్లాడిన తనపై పరువు నష్టం దావా కేసు వేస్తే ప్రయోజనం ఉండదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కూడా బెయిల్‌పై బయట తిరుగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ధర్మస్థలపై అపప్రచారం చేసిన యూట్యూబ్ చానల్ వారికి కూడా ఎవరి అండదండలు ఉన్నాయో తేలాలన్నారు. శశికాంత్ సెంథిల్ బళ్లారికి అఽధికారిగా వచ్చినప్పుడు తనతో విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన ఇక్కడకు పని చేసేందుకు వచ్చినప్పటి కంటే ముందే సీబీఐ తనను అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు. ఈసందర్భంగా మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ, మాజీ బుడా అధ్యక్షుడు దమ్మూరు శేఖర్, కార్పొరేటర్ హనుమంతు, బీజేపీ నాయకులు ఉమారాజ్, హుండేకర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మస్థలపై కుట్రల వెనుక ఎవరెవరు
ఉన్నారో తెలియాలి
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి వెల్లడి