
అధ్యాపకులు లేక బోధన బంద్
చిక్కబళ్లాపురం: రాష్ట్రంలోని ప్రభుత్వ పీయూ కాలేజీలు ప్రారంభమై నెలలు గడిచాయి, కానీ లెక్చరర్లు లేక బోధన సాగడం లేదు, వెంటనే లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లను నియమించాలని నగరంలోని శిడ్లఘట్ట సర్కిల్ లో ఏఐడిఎస్‌ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. అధ్యాపకుల కొరత వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలకు దూరమవుతున్నారని తెలిపారు. వచ్చే నెలలో విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు ఉన్నాయి, కానీ పాఠాలు జరగలేదు, యుజిసి కొత్త నియమాలు కోర్టులో ఉన్నందున గెస్టు లెక్చరర్‌ల నియామకం జరగడం లేదని అధికారులు చెబుతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని, లేదంటే ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు వీధిన పడతారని అన్నారు. తరువాత కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
ఆస్తి గొడవలో పైశాచికత్వం
● అన్నను నరికిన తమ్ముడు
● వదిన, తండ్రిపైనా దాడి
మైసూరు: ఆస్తి గొడవలో ఉన్మాదిగా మారిన ఓ తమ్ముడు.. అన్నను మచ్చుకత్తితో నరికి చంపిన ఘటన మైసూరు తాలూకా బోరె ఆనందూరులో జరిగింది. గ్రామానికి చెందిన కృష్ణగౌడ కుమారుడు మహేష్ (45) సోదరుడు రవి చేతిలో హత్యకు గురయ్యాడు. వివరాలు.. కృష్ణగౌడకు ఆనందూరులో పొలం ఉంది. దానిని పంపకాలు చేయాలని రవి తరచుగా ఒత్తిడి చేస్తుండేవాడు. పలుమార్లు పంచాయతీలు జరిగాయి. గొడవలు పడి ఇలవాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. కక్ష పెంచుకున్న రవి మంగళవారం అన్న మహేష్, వదిన ఉన్న పంప్‌సెట్ ఇంటికి వచ్చాడు. అక్కడ రగడ పడి వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో మహేష్ తలపై నరికాడు, దీంతో మహేష్ తల సగానికి తెగింది. అడ్డు వచ్చిన వదిన లక్ష్మిపై కూడా దాడి చేశాడు. పొలం వద్ద ఉన్న తండ్రి కృష్ణగౌడపై కూడా రవి దాడి చేశాడు. సుమారు అర గంట పాటు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడిన మహేష్ ఇంటిలోనే మరణించాడు. కృష్ణగౌడ, లక్ష్మిలను గ్రామస్తులు చికిత్స కోసం మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై ఇలవాల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు రవిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు విదేశీ మహిళల అరెస్టు
దొడ్డబళ్లాపురం: వీసా గడువు ముగిసినా నిబంధలకు విరుద్ధంగా బెంగళూరులో నివసిస్తున్న ఇద్దరు విదేశీ మహిళలను సీసీబీ పోలీసులు నిర్బంధించారు. ఇద్దరు విదేశీ మహిళలు భారత్‌కు వచ్చి వీసా గడువు ముగిసినా నిబంధనలకు విరుద్ధంగా బెంగళూరులో నివసిస్తున్నారు. సమాచారం అదుకున్న సీసీబీ మహిళా రక్షణ దళం సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పరప్పన అగ్రహార పోలీసులకు అప్పగించారు. వారి డాక్యుమెంట్లను పరిశీలించకుండా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.
ఎమ్మెల్యే వకీలుకు
ఈడీ నోటీసులపై వాదనలు
శివాజీనగర: చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే వీరేంద్ర పప్పి అక్రమ బెట్టింగ్ దందా కేసుల్లో ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. అతడు ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నాడు. అతని ఆప్తులపై దృష్టి సారించింది. ఈ కేసులో కొన్ని ఆధారాలు సమర్పించాలని ఈడీ ఇచ్చిన సమన్స్ ప్రశ్నిస్తూ బెంగళూరు ఆర్.ఆర్. నగరకు చెందిన హనుమంతరాయప్ప కుమారుడు అనిల్‌గౌడ సమర్పించిన పిటిషన్‌ను హైకోర్టు విచారించి 8కి తీర్పును రిజర్వు చేసింది. తీర్పు వచ్చేవరకు అనిల్‌గౌడ మీద బలవంతపు చర్యలు తీసుకోరాదని ఈడీకి ధర్మాసనం సూచించింది. పిటిషన్‌దారు వృత్తిపరంగా న్యాయవాది, కేసీ వీరేంద్రకు సలహాలను ఇచ్చారు, ఆ మాత్రానికే ఈడీ విచారణకు గురిచేయటం సబబు కాదని ఆయన న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ న్యాయవాదులు స్పందిస్తూ, అనిల్‌గౌడ, కే.సీ.వీరేంద్ర కంపెనీలలో భాగస్వాములయ్యారు. అక్రమంగా సొమ్ము పెట్టుబడి పెట్టినట్లు తీవ్ర ఆరోపణ ఉంది. అందుకే సమన్లు ఇచ్చామని పేర్కొన్నారు. సుదీర్ఘ వాద–ప్రతివాదనలు ఆలకించిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.