భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య
యశవంతపుర: భర్త వేధింపులను తట్టుకోలేక భార్య ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని బాగలగుంట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. సిడేదహళ్లికి చెందిన పూజశ్రీ (28) కి మూడేళ్ల క్రితం నందీశ్‌తో వివాహమైంది. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, భార్య కూడా ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేసేది. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి పూజశ్రీ అనేకసార్లు భర్తను నిలదీసింది. దీంతో ద్వేషం పెంచుకున్న నందీశ్ రోజూ ఆమెను వేధించటం ప్రారంభించాడు. మరింత కట్నం తేవాలని సతాయించసాగాడు. ఇరు కుటుంబాల పెద్దలతో రెండు మూడుసార్లు రాజీ పంచాయతీ కూడా జరిగింది. ఎలాంటి వేధింపులకు పాల్పడనంటూ ప్రమాణం చేసిన భర్త మరుసటి రోజు నుంచే సైకోగా మారేవాడు. మూడు రోజుల క్రితం కూడా దంపతుల మధ్య రగడ జరిగినట్లు తెలిసింది. భర్త వేధింపులతో విరక్తి చెందిన పూజశ్రీ పుట్టింటికి వెళ్లింది. నందీశ్ వెళ్లి నచ్చజెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. పదే పదే పుట్టింటికి ఎందుకు వెళ్తావంటూ మళ్లీ గొడవపడ్డాడు. ఆదివారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పూజశ్రీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. బాగలగుంట పోలీసులు నందీశ్‌పై కేసు నమోదు చేశారు.
భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య


