డీజే సౌండ్.. చిందులు.. ఆగిన గుండెలు
మండ్య: నిమజ్జనం ఊరేగింపులో డీజే సౌండ్ మధ్య చిందులు వేస్తూ ఇద్దరు మరణించారు. మండ్య జిల్లా, చిక్కబళ్లాపురం జిల్లాల్లో ఈ విషాద ఘటనలు జరిగాయి. మండ్య జిల్లాలోని కేఆర్ పేటెల తాలూకాలోని సంతెబాచహళ్ళి దగ్గరున్న జొత్తనపుర గ్రామంలో ఆదివారం సాయంత్రం స్థానికుడు మంజునాథ్ (55) ఇలా చనిపోయాడు. గ్రామంలో యువకులు ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని అందరూ డీజే ధ్వనుల మధ్య ఊరేగింపుగా నిమజ్జనం చేపట్టారు. జనం రంగులు చల్లుకుంటూ చిందులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో మంజునాథ్ నృత్యం చేస్తూనే పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చనిపోయాడని తెలిపారు. మంజునాథ్‌కు గుండెజబ్బు ఉన్నట్లు తెలిసింది. డీజే శబ్దాలు, చిందులే కారణమని భావిస్తున్నారు. కేఆర్‌పేటె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
చిక్కబళ్లాపురం వద్ద ఒకరు
చిక్కబళ్లాపురం: జిల్లా పరిధిలోని బోదగూరు గ్రామంలో గణేశ నిమజ్జనంలో నృత్యం చేస్తూ వ్యక్తి తీవ్ర హృదయాఘాతానికి గురై చనిపోయాడు. లక్ష్మిపతి (40) అనే వ్యక్తి వ్యవసాయ కూలీగా జీవించేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి గ్రామంలో నిమజ్జనం ఊరేగింపు జరిగింది. అందులో లక్ష్మిపతి చిందులు వేస్తూ కుప్పకూలాడు. జనం పరిశీలించగా చనిపోయి ఉన్నాడు. గ్రామంలో విషాదం నెలకొంది.
రెండు చోట్ల ఇద్దరు మృతి
డీజే సౌండ్.. చిందులు.. ఆగిన గుండెలు


