నమో నాగనాథేశ్వర
చింతామణి: పట్టణంలోని ప్రసిద్ద నాగనాథేశ్వరస్వామికి సోమవారం పండితులు ప్రత్యేక అలంకరణ జరిపి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున దర్శించుకొన్నారు. శివలింగానికి పండితులు శాస్త్రోక్తంగా పూజలు గావించారు.
వారం రోజులు వానలే
శివాజీనగర: బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఈ వారాంతం వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కరావళి, కళ్యాణ కర్ణాటక భాగపు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ బెంగళూరు కేంద్ర డైరెక్టర్ సీ.ఎస్.పాటిల్ తెలిపారు. 7వ తేదీ వరకు యాదగిరి, కొప్పళ, బీదర్, కల్బుర్గి జిల్లాల్లో విస్తారంగా, కొన్నిచోట్ల భారీ వర్షం పడవచ్చు. కోస్తా జిల్లాలు, మలెనాడు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. బెంగళూరు చుట్టుపక్కల జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల సాధారణ వర్షాలు కురుస్తాయి. ఆదివారం బెంగళూరు, కరావళి, మలెనాడుతో పాటుగా కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది.
ఏడాది బాడుగకు
హెలికాప్టర్, విమానం!
శివాజీనగర: ప్రభుత్వ పనులకు ఇకపై సంవత్సరం కాంట్రాక్టు చొప్పున హెలికాప్టర్, విమాన సేవలు పొందేందుకు సర్కారు నిర్ణయించింది. కాంట్రాక్ట్ విషయమై డీసీఎం డీ.కే.శివకుమార్, అధికారులతో చర్చించారు. ఇప్పటివరకు గంటల కాలావధిలో హెలికాప్టర్, ప్రత్యేక విమానం బాడుగకు తీసుకునేవారు. ఇకపై సంవత్సరం కాంట్రాక్టులో వాటిని ఉపయోగించుకుంటారు. ఇందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు టెండర్లు వేయాలని ఆహ్వానిస్తారు. గంటల బాడుగ ఆధారంగా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.28 కోట్లు ఖర్చు అవుతోంది. అయినా సమయానికి హెలికాప్టర్లు దొరకడం లేదు.
14 ఏళ్లు బ్యాంకులో
పనిచేసి.. ఫుత్‌పాత్ జీవితం
దొడ్డబళ్లాపురం: జీవితం అంటే నవ్వులు, సుఖాలే కాదు, ఎదురుచూడని కష్టాలు, నష్టాల సమ్మేళనం కూడా. రాత్రికి రాత్రి అదృష్టం తారుమారైన వారు ఎందరో ఉన్నారు. 14 ఏళ్ల పాటు బ్యాంకులో పనిచేసిన ఉద్యోగి.. పని కోల్పోయి ఫుట్‌పాత్ జీవితం గడుపుతున్న సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో ఒకరు ఇది పోస్టు చేశారు. నగరంలోని ఒక ప్రముఖ సిగ్నల్‌లో ఓ వ్యక్తి చేతిలో ప్లకార్డు పట్టుకుని కూర్చున్నాడు. అందులో కన్నడ, ఆంగ్లంలో ఇలా రాసుకున్నాడు.. డిగ్రీ చదివాను, నాకు బ్యాంకింగ్‌లో 14 ఏళ్ల అనుభవం ఉంది. నాకు పని లేదు, ఉండడానికి ఇల్లు లేదు, దయచేసి నాకు డబ్బులు సహాయం చేయండి. డిజిటల్ పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్ బోర్డు కూడా పట్టుకున్నాడు. ఏ బ్యాంకులో పనిచేశాడు, ఎందుకు ఇలా అయ్యాడు అనే వివరాలు లేవు.
నమో నాగనాథేశ్వర


