
ధర్మస్థలపై అంతర్జాతీయ కుట్ర
బనశంకరి: శ్రీక్షేత్ర ధర్మస్థలకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర పై ఎన్‌ఐఏ దర్యాప్తుతో చేయించాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ధర్మస్థల చలో అభియాన నిర్వహించారు. సిట్‌కు బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించాలని, కుట్రకు పాల్పడిన దుష్టశక్తులను చట్టప్రకారం శిక్షించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రపోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు. మంజునాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మైదానంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, ఆర్ అశోక్, సదానందగౌడ, జగదీశ్‌షెట్టర్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. వేలాదిగా కార్యకర్తలు సభకు తరలివచ్చారు.
నేతలు ప్రసంగిస్తూ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. సిట్ దర్యాప్తు పట్ల తమకు ఎలాంటి అనుమానం లేదని కానీ ఈ కేసులో అంతర్జాతీయ శక్తుల హస్తం ఉండటంతో ఎన్‌ఐఏ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ధర్మస్థలకు అపకీర్తి తీసుకురావాలనే దురుద్దేశంతో కుట్రకు పాల్పడ్డారని అన్నారు. ఇందులో సూత్రధారులుగా ఉన్న గిరీశ్‌మట్టణ్ణవర్, సుజాతభట్, మహేశ్‌శెట్టి తిమరోడి, జయంత్ తో పాటు అనేకమంది పాత్ర ఉందని తెలిసింది, ఇంకా చాలా మంది వీరితో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని రానున్నరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బృహత్ అభియాన చేపడతామని తెలిపారు.
ఎన్‌ఐఏతోనే దర్యాప్తు చేయించాలి
ధర్మస్థల సభలో బీజేపీ నేతలు

ధర్మస్థలపై అంతర్జాతీయ కుట్ర