
గుండెపోటుతో అన్నదాత మృతి
హొసపేటె: రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కిత్తూరు తాలూకాలోని హనుమానహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు రంగప్ప తలవార్ (34) ఆదివారం ఉదయం పొలంలో పనులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. అతన్ని తోలహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కొట్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
జిల్లాస్పత్రిలో అన్నీ అక్రమాలే
కోలారు: నగరంలోని ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రిలో దళారుల బెడద అధికంగా ఉంది, వారికి అడ్డుకట్ట వేయాలని, అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న అంబులెన్స్‌ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం రైతు సంఘం నాయకులు ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న పేద రోగులకు ఆస్పత్రిలో కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇస్తున్నారని ఆరోపించారు. సిటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌లను గంటలో చేసిస్తామని పలువురు దళారులు రోగుల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.