
కులాసాగా గజదళం
మైసూరు: ఈ సంవత్సరం అట్టహాసంగా జరగబోయే విశ్వవిఖ్యాత నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాలలో పాల్గొనేందుకు అడవి నుంచి మైసూరుకు విచ్చేసిన గజ దళం సేదదీరుతోంది. హుణసూరు తాలూకా వీరనహొసహళ్లి హాడి నుంచి గజపయన ద్వారా సోమవారం సాయంత్రం మైసూరులోని అశోకపురంలోని అరణ్య భవన్ ఆవరణకు చేరుకున్నాయి. అక్కడే కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలో 9 దసరా గజాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ప్రయాణ బడలికతో ఉన్నందున మంగళవారం అధికారులు పూర్తి విశ్రాంతి కల్పించారు. ఏనుగులకు మావటీలు, కాపలాదారులు స్నానాలు చేయించారు. వరిగడ్డి, పచ్చ గడ్డిని మేతగా అందజేశారు.
అంబారీ అభిమన్యుకే
పశువైద్యులు ఆరోగ్య పరీక్షలను చేశారు. ఏనుగులను దూరం నుంచే వీక్షించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. అటవీ అధికారి డాక్టర్ ప్రభుగౌడ విలేకరులతో మాట్లాడుతూ ఈసారి కూడా అభిమన్యునే బంగారు అంబారీని మోస్తుందని తెలిపారు. మరో మూడు ఏనుగులకు కూడా అంబారీతో తాలీము చేయిస్తామన్నారు. అన్ని ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నాయన్నారు.
ఈసారి సాయంత్రం స్వాగతం
10వ తేదీన సాయంత్రం 6.40 నుంచి 7.20 గంటల మధ్య మకర గోధూళి లగ్నంలో అంబావిలాస్ ప్యాలెస్‌లోని జయ మార్తాండ ద్వారం ద్వారా ఏనుగులను తోడ్కొని వెళ్తారు. ఇక నుంచి దసరా ముగిసేవరకు ప్యాలెస్ ఆవరణలోనే బస చేస్తాయి. ఆదివారం సాయంత్రం నుంచి రాజప్రసాదాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. దీంతో పర్యాటకుల సందడి మరింత పెరగనుంది. సాయంత్రం వేళ విద్యుద్దీప వెలుగుల్లో గజరాజుల స్వాగతోత్సవం జరుగుతుంది. తద్వారా కొత్త రీతిలో ప్రచారం లభిస్తుందని అధికారులు తెలిపారు.
అడవుల నుంచి మైసూరుకు చేరిక
ఆదివారం వైభవంగా ప్యాలెస్ ప్రవేశం

కులాసాగా గజదళం