
బాడీబిల్డర్ హఠాన్మరణం
● హాసన్‌లో విషాదం
యశవంతపుర: ఇనుప కండరాలు, ఉక్కు లాంటి నరాలతో బాడీబిల్డర్‌గా యువతకు ఆదర్శంగా నిలిచాడు. కానీ ఆకస్మిక మృతి నుంచి తప్పించుకోలేకపోయాడు. శ్వాసకోస వ్యాధితో బాడీ బిల్డర్ చనిపోయిన ఘటన హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా బెళగోడు గ్రామంలో జరిగింది. సోమశేఖర్ (30) జిమ్ సోమగా పేరుగాంచాడు. సోమ వర్కౌట్లు, దేహధారుడ్య పోటీల పోటోలు, వీడియోలు వైరల్ అయ్యేవి. సోమశేఖర్ ఆరున్నర అడుగులు, 110 కేజీల బరువుతో పెద్ద వస్తాదులా కనిపించేవాడు. బాడీ బిల్డింగ్‌నే వృత్తిగా ఎంచుకుని ఆ రంగంలో అనేక టైటిళ్లను గెలుపొందాడు. సోమశేఖర్ జాతీయస్థాయి బాడీ బిల్డర్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించాడు. కానీ వారం రోజుల నుంచి శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స ఫలించక సోమవారం రాత్రి మరణించాడు. సోమ మృతితో కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. హాసన్ జిల్లాలో ఆకస్మిక గుండెపోట్లతో ఎంతోమంది చనిపోతుండడం తెలిసిందే.
డ్రగ్స్ ఫ్యాక్టరీ కేసులో పోలీసు సస్పెండ్
మైసూరు: నగరంలో డ్రగ్స్ ఫ్యాక్టరీని కనుకొన్న కేసులో నగర పోలీస్ కమిషనర్ ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఏసీపీ దేవరాజ్ డివిజన్ కార్యాలయంలో పనిచేసే పోలీసు ప్రదీప్ సస్పెండయ్యాడు. ముంబై పోలీసులు మైసూరులో దాడిచేసి ఓ మత్తు పదార్థాల ఫ్యాక్టరీని కనుగొన్నారు. రూ. 390 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. అక్కడ ఫ్యాక్టరీ ఉందని తెలిసినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియజేయలేదని, ముడుపులు తీసుకుంటూ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ వ్యాపారులతో కుమక్కయ్యారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అలాగే నగర వీధుల్లో గంజాయి, డ్రగ్స్ సేవించేవారిని వెతికి పట్టుకుని కేసులు పెడుతున్నారు. ఇప్పటికి వంద మందికి పైగా వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.
బస్సు– క్యాంటర్ ఢీ,
ఇద్దరు మృతి
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా శివపుర వద్ద మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిద్రమంపురంలో క్యాంటర్ కేఎస్ ఆర్టీసీ బస్సు ఓ క్యాంటర్‌ను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో క్యాంటర్ డ్రైవర్, క్లీనర్ అక్కడే దుర్మరణం చెందారు. హుబ్లీ నుంచి క్యాంటర్ మైసూరు వైపు వెళుతుండగా, కడూరు నుంచి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనింది. మృతులిద్దరూ హుబ్లీకి చెందినవారుగా పోలీసులు తెలిపారు. బీరూరు పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
యువ నటుడు అకాల మరణం
యశవంతపుర: శాండల్‌వుడ్ యువ నటుడు సంతోష్ బాలరాజ్ (34) అనారోగ్యంతో మరణించారు. కరియ–2, గణప తో పాటు అనేక సినిమాలలో నటించి మంచి నటునిగా పేరు సంపాదించారు. సంతోష్ కొన్నిరోజుల నుంచి కాలేయ జబ్బుతో బాధపడుతున్నారు. బనశంకరిలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస వదిలారు.