
బస్సు కదలక.. గమ్యం చేరక..
బనశంకరి: బకాయి ఉన్న 34 నెలల వేతనంతో పాటు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం సమ్మె చేయడంతో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అర్జంటు పని ఉండి గమ్యానికి చేరలేక అయోమయానికి గురయ్యారు. బెంగళూరుతో సహా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు ఉదయం నుంచి బస్సు సంచారం నిలిచిపోయింది. సోమవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య , ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. బస్ సౌలభ్యం లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఎంటీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి.
ఒక్కో జిల్లాలో ఒక్కోలా
● మైసూరులో నగరంలో బస్‌సంచారం స్తంభించిపోయింది. కొడగు జిల్లాలో పెద్ద ఇబ్బంది కనిపించలేదు. హాసన్– మైసూరు బస్సులు కుశాలనగరలో నిలిచిపోయాయి.
● రాయచూరులో 50 శాతం బస్సులు మాత్రమే సంచరించాయి. హుబ్లీ–ధార్వాడ జంట నగరాల్లో బస్సులు బంద్ అయ్యాయి.
● సరిహద్దు జిల్లాల్లో ఆంధ్ర, తెలంగాణ బస్సులు మామూలుగా తిరిగాయి. చిక్కబళ్లాపుర జిల్లాలో బంద్ ప్రభావం కనబడలేదు. కానీ ప్రయాణికులు బంద్ అని బస్టాండ్లు రాలేదు. మంగళూరులోనూ బంద్ కనిపించలేదు.
● చిక్కమగళూరులో బస్సులు సంచారం నిలిచిపోవడంతో దీంతో ప్రజలు ప్రైవేటు బస్సులను ఆశ్రయించారు.
● అనేక జిల్లాల్లో దూరపు ప్రయాణానికి బస్టాండ్ల వద్దకు చేరుకున్న మహిళలు, ప్రయాణికులు ఉస్సూరుమన్నారు. బస్టాండ్లు ఖాళీగా కనిపించాయి.
● అత్యవసర కార్యక్రమాల కోసం వెళ్లే అనేకమంది ప్రైవేటు వాహనాల్లో అధిక డబ్బులు ఇచ్చి ప్రయాణించారు. ప్రయాణ వసతి లేక పాఠశాలల్లో హాజరు తగ్గింది. పలు కాలేజీలు, వర్సిటీలలో పరీక్షలను వాయిదా వేశారు.
బలవంతంగా డ్రైవింగ్
శిక్షణలో ఉన్న డ్రైవర్లతో ఆర్టీసీ అధికారులు బలవంతంగా కొన్ని బస్సులను నడిపించారు. సమ్మెకు మద్దతు తెలిపిన డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు బెదిరిస్తున్నారని ఉద్యోగ నేతలు చెప్పారు. విధులకు వెళ్లేవారిని ఇబ్బంది పెట్టబోమని, తమది శాంతియుత సమ్మె అని తెలిపారు. అయితే కోలారు, కొప్పళ యలబుర్గా వద్ద ఆర్టీసీ బస్సులపై అల్లరిమూకలు రాళ్లు విసిరారు. కిటికీల అద్దాలు పగిలాయి.
రాష్ట్రమంతటా ఆర్టీసీ సమ్మె
అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు
మధ్యాహ్నం 4 వరకు అవస్థలు
హైకోర్టు ఆదేశాలతో సమ్మె సమాప్తం
బెంగళూరులో ఎఫెక్ట్
ఆర్టీసీ, బీఎంటీసీ బంద్ ఎఫెక్టు బెంగళూరు నగరంపై ఓ మోస్తరుగా పడింది. విద్యార్థులు, ఉద్యోగులు దిక్కులు చూశారు. మెజెస్టిక్ కెంపేగౌడ బస్టాండు, శాంతినగర, కేఆర్.మార్కెట్, ఎలక్ట్రానిక్‌సిటీ, టిన్ ఫ్యాక్టరీ తదితర అనేక బస్టాండ్లకు ఉదయం నుంచి వచ్చినవారు తెల్లమొహం వేశారు. దూర ప్రాంతాలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. బుకింగ్ డబ్బులు వెనక్కి తీసుకోవడానికి రద్దీ ఏర్పడింది. మరో పక్క బెంగళూరులో ఎలక్ట్రిక్ బస్సులు సంచరించాయి. కేఆర్.మార్కెట్‌లో ప్రైవేటు బస్సులకు గిరాకీ ఏర్పడింది. ఉదయం 9, 10 తరువాత బీఎంటీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి.
సమ్మైపె హైకోర్టు స్టే
శివాజీనగర: ఆర్టీసీ సమ్మైపె దాఖలైన పిటిషన్లను హైకోర్టు మంగళవారం విచారించింది. సమ్మైపె ఇచ్చిన స్టేను 2 రోజులు పొడిగించింది. సమ్మెతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం, ఉద్యోగుల చర్చల సమాచారాన్ని తెలిపారు. కోర్టు ధిక్కారానికి పాల్పడవద్దని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల న్యాయవాదికి జడ్జిలు హెచ్చరించారు. సమ్మెను నిలిపేశారా? అని అడిగారు. హైకోర్టు ఆదేశాలతో మధ్యాహ్నం 4 గంటల నుంచి బంద్‌ను విరమించారు. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ సమ్మెను ముగిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జాయింట్ క్రియా సమితి అధ్యక్షుడు అనంత్ సుబ్బారావ్ తెలిపారు.

బస్సు కదలక.. గమ్యం చేరక..

బస్సు కదలక.. గమ్యం చేరక..

బస్సు కదలక.. గమ్యం చేరక..

బస్సు కదలక.. గమ్యం చేరక..

బస్సు కదలక.. గమ్యం చేరక..

బస్సు కదలక.. గమ్యం చేరక..