
మహిమల స్వామి పేరుతో మస్కా
మైసూరు: రాజభవనాల నగరంలో ఆర్థిక మోసాలు అధికమవుతున్నాయి. సైబర్ మోసగాళ్ల చేతిలో నిత్యం కొందరు వంచనకు గురవుతున్నారు. ఓ బాధితుడు మరో రకమైన మోసానికి గురై రూ. 2.19 కోట్లకు పైగా నగదు, నగలు పోగొట్టుకొని కన్నీరు పెట్టుకొంటున్నాడు. మైసూరులోని జేఎస్‌ఎస్ లేఔట్ నివాసి అరుణ్‌కుమార్ (54) బాధితుడు. మూఢ నమ్మకాలతో నిండా మునిగిపోయాడు.
దేవుడు నా ఒంట్లోకి వస్తాడు, ఇతరుల కష్టాల్లో ఉంటే సహాయం చేయకపోతే మీ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పి భయాన్ని సృష్టించి అరుణ్‌కుమార్ దంపతుల నుంచి రూ. 2.19 కోట్ల నగదు, 202 గ్రాముల బంగారు ఆభరణాలను కొట్టేశారు. దక్షిణ కన్నడకు చెందిన రూపశ్రీ, ఆమె భర్త సందేష్ దంపతులు ఈ కపటడానికి పాల్పడ్డారు.
త్వరలో జర్మనీకి వెళ్తారని
2017లో వాట్సప్ ద్వారా రూపశ్రీ.. అరుణ్‌కుమార్‌తో మాట్లాడింది. అప్పాజీ అనే స్వామీజీ మహిమ కలవాడు, హిమాలయాలలో, కేరళలో తపస్సు చేశాడు. ఆయన మా అమ్మమ్మ క్యాన్సర్‌ను నయం చేశాడు అని తెలిపింది. మీరు పనికి వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయని, దీనిని నివారించడానికి పరిష్కారం సూచిస్తారు అని చెప్పి దఫదఫాలుగా డబ్బులు వసూలు చేసింది. మహిమలు జరిగినట్లు చూపే కొన్ని నకిలీ వీడియోలను అరుణ్‌కుమార్ కుమార్‌కు పంపింది. అప్పాజీ జోస్యం మేరకు మీరు జర్మనీ యాత్ర చేయబోతున్నారు అని చెప్పింది. ఆ విధంగా అరుణ్‌కుమార్ భార్య జర్మనీకి వెళ్లింది. తరువాత అతని కుమారుడు కూడా జర్మనీకి వెళ్లారు. దీంతో అరుణ్‌కుమార్‌కు మరింత నమ్మకం కుదిరింది. ఆ రీతిలో రూ.2.19 కోట్ల నగదు, 202 గ్రాముల బంగారాన్ని రూపశ్రీ తీసుకుంది. అప్పాజీ స్వామిని చూడాలని అరుణ్‌కుమార్ కోరగా, కుదరదని చెప్పింది. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా మోసమని తేలింది. మోసగాళ్లను అరెస్టు చేయాలని, తన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితుడు మైసూరు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
రూ. 2.19 కోట్లు స్వాహా
మైసూరులో ఘరానా మోసం

మహిమల స్వామి పేరుతో మస్కా