
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వందలాది మందిని హత్య చేసి, మృతదేహాలను ఖననం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పారిశుధ్య కార్మికుడు చెప్పిన 13 పాయింట్లకుగాను 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. మంగళవారం 11వ పాయింట్‌లో సిట్ అధికారులు, పోలీసులు కూలీలతో తవ్వించారు. అక్కడ అస్థిపంజరాలేవీ లభించలేదని సమాచారం.
సోమవారం 10వ పాయింట్ వద్ద కొన్ని అస్థిపంజరాల అవశేషాలు దొరికాయి. దీంతో మంగళవారం ఇంకా ఎక్కువ ఆధారాలేమైనా దొరుకుతాయా? అనే ఉత్కంఠ ఏర్పడింది. 11వ పాయింట్‌లో రెండున్నర గంటల పాటు ఆరు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఎలాంటి కళేబరాలు లభించలేదు. తరువాత ఆ గుంతను పూడ్చివేశారు. మధ్యాహ్నం తర్వాత 12వ పాయింట్‌లో తవ్వకాలు చేపట్టగా, భారీ వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది. కార్మికులు మట్టిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా ఆరు పాయింట్లలో మానవ అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. 13వ పాయింట్‌లో తవ్వాల్సి ఉంది.