
ఎవరికీ పట్టని కార్మికుల కాలనీ
రాయచూరు రూరల్: బడాబాబులు నివాసం ఉంటున్న కాలనీల్లో సిమెంటు రోడ్లు, మంచినీరు తదితర సదుపాయాలు ఉంటాయి. అదే పేదలు, కార్మికులు నివాసం ఉంటున్న కాలనీల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అధికారులు ఆ కాలనీల వైపు కన్నెత్తి చూడరు. ఇలాంటి పరిస్థితే నగరంలో కనిపిస్తుంది. ఇక్కడి ఏపీఎంసీ హమాలీ కాలనీలో సమస్యలు తిష్టవేశాయి. 2011లో ముఖ్య మంత్రి ఎస్‌ఎం కృష్ణ హయాంలో ఏపీఎంసీ హమాలీల, కార్మికులకు కాలనీ నిర్మించారు. వారికి పక్కా గృహాలు కల్పించి ఇంటి హక్కు పత్రాలందించారు. అయితే నగర సభలో రిజిస్ట్రేషన్ చేయలేదు. కాలనీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో నీరు చేరడంతో గుంతలు కనిపించక వాహనదారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. ఇక మురుగు కాలువలు పూడికతో నిండిపోయి వాటి స్వరూపానే కోల్పోయాయి. దీంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరుతోంది. కాలనీవాసులు దుర్వాసన మధ్య జీవనం చేయాల్సి వస్తోంది. కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు దుస్థితికి చేరాయి. భవనాల కప్పులు పెచ్చులూడుతున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళన మధ్య పాఠాలు వింటున్నారు. కాలనీలో ఇన్ని సమస్యలున్నా పాలకులు, అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని పేదలు కోరుతున్నారు.
అధ్వానంగా రహదారులు
పూడిక నిండిన మురుగు కాలువలు
దుస్థితిలో పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు
సమస్యల మధ్య సహజీవనం చేస్తున్న పేదలు

ఎవరికీ పట్టని కార్మికుల కాలనీ

ఎవరికీ పట్టని కార్మికుల కాలనీ