
అభివృద్ధి పనులకు భూమిపూజ
రాయచూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని రూరల్ ఎమ్మెల్యే బసవన గౌడ సూచించారు. తాలూకాలోని మన్సలాపూర్‌లో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, చిక్కసూగురులో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన భూమి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడుతామన్నారు.
ఎలుగుబంటి, అడవి పంది దాడిలో పంటలు ధ్వంసం
హొసపేటె: ఎలుగుబంటి, పందుల దాడిలో పంటలు ధ్వంసమయ్యాయి. ఈఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కనమడుగు గ్రామంలో జరిగింది. రాత్రి సమయంలో ఎలుగుబంట్లు, పందులు మొక్కజొన్న పంటలోకి చొరబడి మొక్కజొన్నను తినడమే కాకుండా వాటిని తొక్కి విరిచి నాశనం చేశాయి. గ్రామం పొరుగున ఉన్న దావణగెరె జిల్లాలోని జగలూరు తాలూకాలోని అనబురు అటవీ ప్రాంతంలో నుంచి నిత్యం వన్యజీవులు పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు, పందుల బెడదనుంచి పంటలను కాపాడాలని, ధ్వంసమైన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కామయ్యవర బొమ్మప్ప, తిప్పేస్వామి, మంజమ్మ, తిండమ్మ, నాగరాజు, దుగ్గప్ప కోరారు.
కళాశాల విద్యార్థిపై క్రికెట్ బ్యాట్లతో దాడి
సాక్షి,బళ్లారి: ఓ కాలేజీ విద్యార్థిపై సినిమా రీతిలో 10 మంది కాలేజీ గ్యాంగ్ దాడి చేయడం నగరంలో కలకలం సృష్టించింది. నగరంలోని రెడియో పార్క్‌లో ఉన్న ఐటీఐ కాలేజీ మైదానంలో జరిగిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చి దాడి దృశ్యాలు సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ బాలిక ఫొటో వ్యాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడని కాలేజీ విద్యార్థి దొడ్డబసవ (19)పై శశికుమార్, సాయికుమార్ తదితరులు 10 మంది దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కాళ్లు పట్టుకున్నా వదలకుండా దాడి చేశారు. తల, నడుము భాగంలో క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశారు. బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌల్‌బజార్ పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దాడి చేసిన వారు కూడా కాలేజీ విద్యార్థులే అని తెలిసింది. తీవ్రంగా గాయపడిన దొడ్డబసవ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లారు.
నేహా హత్యకేసు నిందితుడి బెయిల్‌పై నేడు విచారణ
హుబ్లీ: నగరంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహ హిరేమఠ హత్య కేసును నిందితుడి బెయిల్ పిటిషన్ అదనపు జిల్లా సెషన్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో నేహ తండ్రి, కార్పొరేటర్ నిరంజనయ్య హిరేమఠ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి నివాసానికి ఆదివారం వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం నిరంజనయ్య మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె హత్య విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు తన కుమార్తె విషయంలో పోరాటం చేశాయన్నారు. నిందితుడు ఫయాజ్‌కు బెయిల్ లభిస్తే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. నటుడు దర్శన్‌కు ఇచ్చినట్లుగానే బెయిల్ ఇవ్వాలని నిందితుడి తరపున న్యాయవాది వాదిస్తున్నారన్నారు. 2024 ఏప్రిల్ 18న హుబ్లీ బీవీబీ కళాశాల ఆవరణలో 24 ఏళ్ల ఎంసీఏ విద్యార్థి నేహ హిరేమఠ దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే 10కి పైగా కత్తిపోట్లతో విద్యార్థిని బలైంది. ఈ కేసులో నిందితుడు బెళగావి జిల్లాకు చెందిన ఫయాజ్ కొండ నాయక్(24) అరెస్ట్ అయ్యాడు.
ఆకట్టుకున్న స్టీల్ సిటీరన్
సాక్షి,బళ్లారి: దైనంది జీవితంలో ప్రతి ఒక్కరు యోగా, వాకింగ్, రన్నింగ్ తదితర ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. బళ్లారి సైక్లిస్ట్, రన్నర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బళ్లారిలో ఆదివారం స్టీల్ సిటీ రన్ నిర్వహించారు. స్థానికులతోపాటు వివిధ రాష్ట్రాల యువతీ యువకులు పాల్గొన్నారు. విజిడం ల్యాడ్ స్కూల్ నుంచి యువతీ యువకులు పరుగును ప్రారంభించారు. 10 కిలో మీటర్లు, అనంతరం 5 కిలో మీటర్లు, అనంతరం 3 కిలో మీటర్లు రన్నింగ్ రస్ నిర్వహించారు. జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డాక్టర్లు.బీకే.సుందర్, సోమనాథ, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ

అభివృద్ధి పనులకు భూమిపూజ