
అంగన్‌వాడీలో చిన్నారులు బందీ
రాయచూరు రూరల్ : అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన ముక్కుపచ్చలారని చిన్నారులు గంటలకొద్దీ బందీలుగా మారారు. ఆహారం, నీళ్లు లేకుండా ఆకలి దప్పులతో గడిపారు. అంగన్‌వాడీ సహయకురాలు పిల్లలను గదిలో ఉంచి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. దీంతో పిల్లలు గంటలకొద్దీ గదిలోనే బందీగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈఘటన యాదగరి జిల్లా గురుమిటకల్ తాలూకాలో జరిగింది. బందూర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రం కార్యకర్త నెలవారీ సమావేశం కోసం శనివారం గురుమిటకల్ వెళ్లారు. ఆ సయయంలో సహాయకురాలు సావిత్రి విధుల్లో ఉన్నారు. ఉదయం 9 గంటలకు పిల్లలు కేంద్రానికి వచ్చారు పిల్లల యెగ క్షేమాలు చూసుకోవాల్సిన సావిత్రి వారిని గదిలో ఉంచి తాళం వేసి పొలం పనులకు వెళ్లింది. దీంతో పిల్లలు ఏడుస్తుండగా స్థానికులు గమనించి కార్యకర్తకు సమాచారం ఇచ్చారు. ఆమె 12గంటలకు కేంద్రానికి చేరుకొని పిల్లలను గది నుంచి బయటకు తీసుకువచ్చారు. సహాయకురాలు తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో నమ్మకంతో పిల్లలను కేంద్రానికి పంపితే వారిని గదుల్లో బంధించి వేరే పనులకు వెళ్తారా అని మండిపడ్డారు.
పిల్లలను గదిలో ఉంచి పొలానికి వెళ్లిన అంగన్‌వాడీ సహాయకురాలు
గంటలపాటు అన్నం నీళ్లు లేకుండా గడిపిన చిన్నారులు