
కళామతల్లి ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ
బళ్లారిఅర్బన్: విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని 60, 70 ఏళ్ల క్రితం కూడా బళ్లారి రాఘవ తన అద్భుతమైన వాగ్దాటితో కళావాచ్చస్పతిగా ఖండాంతర ఖ్యాతిని గడించారని తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలిదండ నిత్యానందరావ్ అన్నారు. బళ్లారి రాఘవ జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం స్థానిక రాఘవ కళా మందిరంలో రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమం, నాటకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగు, కన్నడ, ముఖ్యంగా ఇంగ్లిష్ నాటకాలలో బళ్లారి రాఘవ తనదైన శైలిలో ప్రతిభ చాటి విదేశాలలో కూడా తన అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకుల మనసు చూరగొన్నారన్నారు. బళ్లారి గడ్డపై పుట్టి విదేశాలలో కూడా తన అద్భుతమైన అభినయంతో సరికొత్త చరిత్ర సృష్టించారని, నాటక రంగానికి రాఘవ చేసిన సేవలు అనన్యమని కొనియాడారు. నాటక రంగానికి ఆయన వన్నెలు అద్దిన మహానటుడని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మేడూరు గ్రామానికి గుమ్మడి గోపాలకృష్ణకు బళ్లారి రాఘవ రాష్ట్ర ప్రశస్తిని అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన బళ్లారి రాఘవ సేవలను కొనియాడి ఆయన స్వరంతో పద్యాలను కూడా ఆలపించారు. బళ్లారి రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు కే.చెన్నప్ప, పదాధికారులు రమేష్ గౌడ పాటిల్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్.ప్రకాష్, ధనుంజయ, రామాంజినేయలు, ప్రముఖులు స్థానిక, ఆంధ్ర కళాభిమానులు పాల్గొన్నారు.

కళామతల్లి ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ