
తుంగభద్ర వరద యథాతథం
హొసపేటె: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల రైతుల జీవనాడి తుంగభద్ర డ్యాం నిండుకుండలా తొణికిసలాడుతోంది. సోమవారం డ్యాం వద్ద ఎగువ నుంచి జలాశయంలోకి వస్తున్న ఇన్‌ఫ్లో 1,20,382 క్యూసెక్కులుగా నమోదైంది. అధికారుల లెక్కల ప్రకారం సాయంత్రానికి జలాశయంలోకి మరింత వరద పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికారులు జలాశయానికి ఉన్న వరదతో 27 క్రస్ట్‌గేట్లను తెరిచారు. 20 క్రస్ట్‌గేట్లను 4.5 అడుగులు, మిగతా 7 క్రస్ట్‌గేట్లను 2.5 అడుగుల మేర పైకెత్తి నదికి 1,15,759 క్యూసెక్కుల నీటిని మళ్లించారు. ఏ క్షణమైనా మరింత నీటిని నదిలోకి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లక్ష క్యూసెక్కుల నుంచి 1.40 లక్షల క్యూసెక్కుల వరకు ఏ క్షణంలోనైనా నదికి నీరు మళ్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరో వైపు రాత్రి వేళ విద్యుత్ దీపకాంతుల వెలుగులో డ్యాం అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.58 అడుగులు, నీటి నిల్వ 75.13 టీఎంసీలుగా ఉంది.
కంప్లి వంతెనపై నిలిచిన రాకపోకలు
తుంగభద్ర జలాశయం నుంచి నదికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీటిని సోమవారం విడుదల చేయడంతో చిక్కజంతకల్ సమీపంలో ఉన్న కంప్లి రోడ్డు వంతెనపైకి నీటి ప్రవాహం భారీగా చేరింది. దీంతో నదిలో తీవ్ర వరద పరిస్థితి తలెత్తిందని, వంతెనపై గుండా వాహన రాకపోకలను నిషేధిస్తూ ప్రజా పనుల శాఖ గంగావతి డివిజన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విశ్వనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. అందువల్ల వంతెనపై వాహనాలు, ప్రజల రాకపోకలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులకు సూచించారు. నీటి ప్రవాహంతో కంప్లి మీదుగా బళ్లారి, గంగావతి మధ్య వాహనాల సంచారం నిలిచిపోయింది.
హంపీలో నీట మునిగిన స్మారకాలు
తుంగభద్ర జలాశయం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల నీరు నదికి విడుదల చేయడంతో హంపీలో నదీ తీరం వెంట ఉన్న స్మారకాలు నీట మునిగాయి. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హొసపేటె సమీపంలోని తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఆనకట్ట నుంచి నదిలోకి లక్షకు పైగా క్యూసెక్కుల నీరు విడుదలైంది. నీటి విడుదల కారణంగా హంపీలోని కొన్ని స్మారకాలు మునిగి పోయాయి. పురంధర మంటపం ఇప్పటికే పూర్తిగా మునిగింది. అనేక మంటపాల్లో సగం వరకు నీరు చేరింది. మరో వైపు కోదండరామ ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా మూసుకు పోయింది.
నిండుకుండలా తొణికిసలాడుతున్న టీబీ డ్యాం
డ్యాంకు ఎగువ నుంచి 1,20,382 క్యూసెక్కుల రాక
డ్యాం వద్ద 27 క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల

తుంగభద్ర వరద యథాతథం

తుంగభద్ర వరద యథాతథం

తుంగభద్ర వరద యథాతథం