
రైతుల సమాధులపై సర్కారు రాజకీయం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఏడాదిలో 980 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని, రైతుల ఆత్మహత్యలకు పరిహారం కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం తనయుడు యతీంద్ర తన తండ్రి పాలనను నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ పాలనతో పోల్చడం విడ్డూరమన్నారు. రైతులకు కనీసం యూరియా అందించి రైతులు పంటలను ఆదుకోలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. రైతులు సమాధులపై రాజకీయం చేసే ఈ సర్కార్‌కు జనం తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రైవేటు మార్కెట్‌లో, బ్లాక్‌లో కుప్పలు తెప్పలుగా యూరియా, రసాయనిక ఎరువుల అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. అలాంటిది రైతులకు ఎందుకు లభించడం లేదని మండిపడ్డారు. బంగ్లాదేశ్, శ్రీలంకకు ఎగుమతి అవుతోందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు శాపంగా మారిందన్నారు.
ముందస్తు వర్షాలతో సకాలంలో పంటలు
ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడం వల్ల రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు వీలైందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం, రైతులపై కపటప్రేమ చూపడం వల్ల శాపంగా మారిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రికి రైతుల సమస్యలు వినే సమయం కూడా లేదన్నారు. ఆయన ఆ శాఖలో పని చేస్తున్నారో లేదో తెలియడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వక పోవడంతో రైతుల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. ఎరువుల కొరత విషయంలో సంబంధిత మంత్రితో రాజీనామా చేయించాలని సీఎంను డిమాండ్ చేశారు. ముందు జాగ్రత్త లేని మంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని మండిపడ్డారు. టీబీడ్యాం క్రస్ట్‌గేట్ల మరమ్మతులు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మోర్చా జిల్లా అధ్యక్షుడు ఐనాథరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురులింగనగౌడ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వంలో 3,400 మంది రైతుల ఆత్మహత్యలు
ఏడాదిలో 980 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు
రైతులకు కనీసం యూరియా ఇవ్వలేని స్ధితిలో సర్కార్
ఎరువుల సరఫరాపై సర్కార్ కనీస
ఆలోచన చేయలేదు
మాజీ మంత్రి శ్రీరాములు ఆగ్రహం