సాక్షి,బళ్లారి: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడం బీజేపీ నాయకులకు మింగుడు పడటం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పుంజుకుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నగరంలోని రాక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలన్నారు. శక్తి యోజన, గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల ద్వారా మహిళలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ.2000 మహిళల ఖాతాల్లోకి అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా మహిళలందరూ వివిధ వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పంచ గ్యారెంటీలను గుర్తుంచుకొని రాబోయే ప్రతి ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీని బలపరచాలన్నారు.
కార్యకర్తల మధ్య రసాభాస
కాగా సమావేశంలో కాసేపు మహిళా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రసాభాస జరిగింది. మాజీ కార్పొరేటర్ పర్వీన్ భాను తన మద్దతుదారులతో కలిసి సమావేశాన్ని బహిష్కరించారు. తనను వేదికపైకి ఆహ్వానించలేదని మండిపడ్డారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెను బుజ్జగించి వేదికపైకి తీసుకొచ్చి సన్మానించారు. అనంతరం సమావేశం యధావిధిగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగంలో తలెత్తిన విభేదాలను పరిష్కరిస్తామన్నారు. కుటుంబంలో సమస్యలు సహజంగానే ఉంటాయన్నారు. వాటిపై చర్చించి సత్వరం పరిష్కరిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, మహిళా కాంగ్రెస్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
పంచ గ్యారెంటీలతో
పేద కుటుంబాలకు మేలు
గృహలక్ష్మి, శక్తి యోజనలతో మహిళల్లో సంతోషం వెల్లివిరిసింది
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి
ఎన్నికలహామీలన్నింటినీ నెరవేర్చాం