
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్‌కు ఊరట
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాలిని రజనీశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్‌పై కేసులో కర్ణాటక హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్‌కు మధ్యంతర ఊరట లభించినట్లయింది. ఆ వ్యాఖ్యలపై చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు చేయలేదు. మూడో వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. రవికుమార్ వ్యాఖ్యల్లో నేరపూరిత అంశాలు లేవని ఎమ్మెల్సీ తరపు సీనియర్ న్యాయవాది అరుణ్ శ్యామ్ వాదనను వినిపించారు. వాదప్రతివాదనల తరువాత మధ్యంతర స్టే ఇస్తూ న్యాయమూర్తి ఎస్.ఆర్.కృష్ణకుమార్ ఉన్న ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ప్రజ్వల్‌కు బెయిల్ నిరాకరణ
యశవంతపుర: అత్యాచార కేసులో జైల్లో ఉన్న హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రజ్వల్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి దానిని తిరస్కరించారు. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రజ్వల్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేశాయి. ఆయన ఇప్పటికే జైలుకెళ్లి 14 నెలలు పూర్తి చేసుకొని పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్నారు. బెయిల్ దొరకనందున ప్రజ్వల్ కుటుంబం నిరాశకు గురైంది. హాసన ఎంపీగా ఉన్న సమయంలో తమ ఇంటిలో పని చేస్తున్న మహిళను బెదిరించి లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలపై ఆయన జైలులో ఉన్నారు.
టెన్త్, పీయూసీ ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలు
శివాజీనగర: రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ పరీక్ష పద్ధతిలో అతి ప్రాముఖ్యమైన మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం నియమాలను ప్రకటించింది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ పాస్ కావటానికి పరీక్ష, అంతర్గత మూల్యాంకనం రెండు కలిపి 33 శాతం మార్కులు పొందితే చాలని వెల్లడించింది. ప్రతి సబ్జెక్టులో అంతర్గత మూల్యాంకనంలో 20కి 20 మార్కులు పొందితే మిగతా 13 మార్కులను రాత పరీక్షలో పొందినా విద్యార్థి పాస్. 20 శాతం మార్కులకు అంతర్గత మూల్యాంకనం ఉంటుంది. 625 మార్కులకు 206 మార్కులు పొందిన విద్యార్థి, వేరే సబ్జెక్టులో 30 శాతం కంటే తక్కువ మార్కులు పొందినా కూడా పాస్. ఈ విషయంపై ప్రజలు అభ్యంతరాలు, సలహాలు ఇవ్వడానికి 15 రోజుల గడువును ఇచ్చారు.
గొంతులో వేరుశనగ గింజలు ఇరుక్కొని చిన్నారి మృతి
హోసూరు: వేరుశనగ గింజలు గొంతులో చిక్కుకొని ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఈ విషాధ ఘటన రాయకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. రాయకోట సమీపంలోని బోడంపట్టి గ్రామానికి చెందిన మదన్, దైవాణి దంపతులకు రుజిత అనే ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది. గురువారం ఉదయం దైవాణి వంటచేస్తుండగా చిన్నారి వేరుశనగ గింజలు తింటుండగా గొంతులో చిక్కుకున్నాయి. దీంతో ఊపిరాడక స్పృహ కోల్పోయింది. రాయకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. రాయకోట పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.