
కేఐఏలో బంగారం పట్టివేత
దొడ్డబళ్లాపురం: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని దుండగుడు ఒక ప్రయాణికుడి లగేజ్ ట్రాలీలో పెట్టి పరారైన సంఘటన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు బంగారంతో వచ్చిన స్మగ్లర్ పట్టుబడతాననే భయంతో బంగారం ఉన్న బ్యాగ్‌ను తోటి ప్రయాణికుడికి చెందిన లగేజ్ ట్రాలీలో ఉంచి ఎస్కేప్ అయ్యాడు. ప్రయాణికుడు తన ట్రాలీ తోసుకుంటూ వస్తుండగా బ్యాగ్‌లో నుంచి బంగారు బిస్కెట్ బయటపడింది. అతడు తక్షణం సెక్యూరిటీకి సమాచారం ఇచ్చాడు. బ్యాగ్‌ను పరిశీలించగా 3.5 కేజీల బంగారం లభించింది. కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం: వివాహిత అనుమానాద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో చోటుచేసుకుంది. అంచెపాళ్యలలో అభిషేక్, స్పందన(24) దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో స్పందన అభిషేక్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అభిషేక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కట్నం కోసం స్పందనను వేధించేవారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడ్చేది. ఇటీవల ఇరు వైపుల పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలు ఇప్పించారు. గురువారం భీమన అమావాస్య నేపథ్యంలో భర్తకు పాదపూజ చేసిన స్పందన శుక్రవారం ఉదయం విగతజీవిగా మారింది. స్పందన మృతి చెందినట్లు తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి బోరున విలపించారు. అయితే స్పందనను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేశారని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో ప్రధానోపాధ్యాయుడు
రాయచూరు రూరల్: విధి నిర్వహణ వేళలో సరిగా విధులు నిర్వహించకుండా మద్యం తాగి విధులకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బాగోతం రాయచూరు జిల్లాలో వెలుగు చూసింది. మస్కి తాలూకా గోనాళ్ అంబాదేవి నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నింగప్ప పాఠశాల సమయంలో మద్యం తాగి వచ్చి వంట గది ముందే నిద్రిస్తాడని గ్రామస్తులు పేర్కొన్నారు. నింగప్ప ప్రవర్తనలో మార్పు తేవాలని లేదా అతనిని ఉద్యోగం నుంచి తొలగించాలని తాలూకా, జిల్లా విద్యాశాఖాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. ప్రధానోపాధ్యాయుడి వద్ద సదరు అధికారులు లంచం తీసుకుని మిన్నకున్నారని ఆరోపించారు.
పులుల మృతిపై సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
మైసూరు : చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర అటవీ ప్రాంతంలో ఐదు పులులను విషప్రయోగం చేసి చంపిన కేసుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అడవుల్లో అటవీ సిబ్బంది కొరతపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఐదు పులుల మృతి కేసులో చర్యలు ప్రారంభించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత నెలలో మలెమహదేశ్వర బెట్ట అటవీ ప్రాంతంలో ఒక తల్లి పులి, నాలుగు పిల్ల పులులు చనిపోయిన సంగతి విదితమే. అటవీశాఖాధికారులు, పరిశీలకుల పోస్టులు 80 శాతం ఖాళీగా ఉండడంపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండడం సరికాదు. మానవ, జంతు సంరక్షణకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు పర్యావరణ, అటవీ వాతారవణ మార్పుల మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

కేఐఏలో బంగారం పట్టివేత