
మైసూరు దసరాకు ఏర్పాట్లు షురూ
మైసూరు : ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాడహబ్బ మైసూరు దసరాను ఈ యేడాది 11 రోజుల పాటు వేడుకలు నిర్వహించడానికి మైసూరు జిల్లా పాలన విభాగం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. మరోపక్క మైసూరు రాజ వంశానికి చెందిన మైసూరు ప్యాలెస్‌లో సాంప్రదాయ పద్ధతిలో నవరాత్రి పూజా విధి విధానాలు నిర్వహించడానికి సైతం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. నవరాత్రి వేడుకల సందర్భంగా మైసూరు ప్యాలెస్‌లో రాజవంశానికి చెందినవారు బంగారు సింహాసనానికి పూజ, ప్రైవేట్ దర్బార్, సరస్వతి పూజ, రత్నాలతో పొదిగిన ఆయుధాలకు రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్ మార్గదర్శనంలో యదువీర్ ఒడెయర్ పూజలను నిర్వహిస్తారు. మైసూరు రాజ వంశస్తులు ప్యాలెస్ పంచాంగం, ఒంటికొప్పలి పంచాంగం, మేలుకోటె పంచాంగాలను ఆధారంగా చేసుకొని తమ పూజా విధివిధానాలను నిర్వహిస్తారు. ఈ యేడాది కూడా అదే విధంగా నిర్వహించడానికి తేదీలను కూడా ప్రకటించారు.
ఏయే తేదీల్లో ఎలాంటి పూజలు...
సెప్టెంబర్ 22వ తేదీన నవరాత్రి ప్రారంభం అవుతుంది. ఆరోజు ఉదయం 10 నుంచి 10.40 గంటల మధ్య వృశ్చిక లగ్నంలో చాముండి కొండపైన నాడ శక్తిదేవత చాముండేశ్వరి సన్నిధిలో నాడహబ్బ మైసూరు దసరా వేడుకలను ప్రారంభిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంబా విలాస్ ప్యాలెస్‌లో రత్నాలతో పొదిగిన సింహాసనానికి పూజలు, ప్రైవేట్ దర్బార్ ప్రారంభిస్తారు. 23న బ్రహ్మచారిణి పూజ, 24న చంద్రఘాటె, 25న కూష్మండ, 26న స్కంధమాత, 27న కాత్యాయిని, 28న సిద్దధాత్రీ, 29న ఉదయం సరస్వతి పూజ, రాత్రి కాళరాత్రి పూజతోపాటు మహిషాసుర సంహారం, జరగనుంది. 30న దుర్గాష్టమి, అక్టోబర్ 1వ తేదీన ఆయుధ పూజ, 2న విజయదశమి పూజలు నిర్వహిస్తారు. 6న చాముండి కొండపై చాముండేశ్వరి దేవి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ పూజలన్నీ చేయడం ద్వారా మైసూరు ప్యాలెస్‌లో శరన్నవరాత్రి పూజలు సంపన్నం అవుతాయి.
ఆగస్టు 7న గజపడె ప్రవేశం...
నాడ హబ్బ మైసూరు దసరా మహోత్సవ వేడుకల్లో పాల్గొననున్న జంబూ సవారికి 14 ఏనుగులను ఎంపిక చేశారు. మొదటి విడతలో 9 ఏనుగులు రానున్నాయి. అవి వచ్చే సమయంలో గజపయన ప్రారంభిస్తారు. అభిమన్యు ఆధ్వర్యంలో భీమ, కంజన్, ధనంజయ, ప్రశాంత, మహేంద్ర, ఏకలవ్య, ఆడ ఏనుగులు కావేరి, లక్ష్మిదలను ఎంపిక చేశారు. ఈ ఏనుగులు ఆగస్టు 4వ తేదీన మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని నాగరహొళె అభయారణ్య ప్రముఖ ద్వారం అయిన వీరన హొసహళ్లి నుంచి గజపయన ప్రారంభిస్తాయి. మైసూరుకు వచ్చి అశోకపురంలో ఉన్న అరణ్య భవనంలో బస చేస్తాయి.
ఈ యేడాది 11 రోజుల పాటు నవరాత్రి వేడుకలు
అక్టోబర్ 2వ తేదీన విజయదశమి విశేష పూజలు