
సిగందూరుకు ప్రత్యేక బస్సు సేవలు
హుబ్లీ: శివమొగ్గ జిల్లాలోని సుప్రసిద్ధ సిగందూరు చౌడేశ్వరి దేవి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తాదులకు అనుకూలం కోసం ఆదివారం, సార్వజనిక సెలవు రోజుల్లోలో హుబ్లీ గోకుల్ రోడ్డు బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని వాయువ్య కర్ణాటక ఆర్‌టీసీ సంస్థ డివిజనల్ కమిషనర్ హెచ్.రామనగౌడర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, భక్తుల డిమాండ్ మేరకు సిగందూరు చౌడేశ్వరి దేవి దర్శనానికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి దర్శించుకొని తిరిగి రావడానికి అనుకూలం అయ్యేలా ఆదివారం, సెలవు రోజుల్లో బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సు గోకుల్‌రోడ్డు బస్టాండ్ నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సిగందూరు చేరుకుంటుందన్నారు. అలాగే తిరిగి సిగందూరు నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హుబ్లీకి రాత్రి 9 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణ టికెట్ ధర రూ.620గా నిర్ణయించామని తెలిపారు. శక్తి పథకం ఈ బస్సుకు అన్వయించదు. మరిన్ని వివరాలకు 7760991678లో సంప్రదించాలని ఆయన కోరారు. కాగా కేంద్ర మంత్రి నితీన్ గడ్ఖరీ ఈనెల 14న దేశంలోనే అతి పొడవైన రెండో కేబుల్ సిగందూరు వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే.