
పేదల నమ్మ క్లినిక్ ప్రారంభం
బళ్లారిఅర్బన్: నగర పరిధిలోని జనవసతి ప్రాంతాల్లో నమ్మ క్లినిక్ ప్రజలకు నాణ్యమైన సేవలకు ప్రాధాన్యతనిస్తుందని, సామాన్య రోగులకు స్థానికంగా చికిత్స పొందడానికి అనుకూలం కానుందని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో కరిమారెమ్మ కాలనీలో నూతన నమ్మ క్లినిక్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సామాన్య ప్రజలు ఆరోగ్య సమస్యలతో దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం ఇకపై ఉండదన్నారు. నగర పేదలు, ఆర్థికంగా వెనుకబడిన సమాజం వారికి నమ్మ క్లినిక్ పరిధిలో ఉచితంగా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను ఈ క్లినిక్‌లో కల్పిస్తారన్నారు. మున్ముందు ఈ కాలనీలోనే సుమారు రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు.
మూడు క్లినిక్‌లు సేవలకు సిద్ధం
డీహెచ్‌ఓ డాక్టర్ యల్లా రమేష్ బాబు మాట్లాడుతూ గురువారం నుంచి శ్రీరాంపుర కాలనీ, ఏపీఎంసీ మార్కెట్‌లతో కలిపి నగరంలో మూడు నమ్మ క్లినిక్‌లు ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు సిద్ధమయాయన్నారు. మొత్తం 20 క్లినిక్‌లు జిల్లాలో సామాన్య ప్రజలకు ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటాయన్నారు. సుమారు 10 వేల నుంచి 20 వేల జనాభాకు అనుగుణంగా ఇవి సేవలు అందిస్తాయన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు నమ్మ క్లినిక్‌ల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇక్కడ ఓ వైద్యాధికారి, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్, డీ గ్రూప్ ఉద్యోగులు ఉంటారన్నారు. చంద్రకళ, చాందిని, కార్పొరేటర్ మించు శ్రీనివాస్, జిల్లా సర్జన్ డాక్టర్ బసరెడ్డి, డాక్టర్ హనుమంతప్ప పాల్గొన్నారు.
సామాన్య రోగులకు అనుకూలం
నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి