
యువతిని బలిగొన్న ఏనుగు
యశవంతపుర: అడవి ఏనుగు దాడిలో యువతి దుర్మరణం చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పుర తాలూకాలో జరిగింది. హొన్నళ్లి గ్రామానికి చెందిన అనిత (25) బంధువుల కాఫీతోటలో పని ముగించుకొని బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి నడిచి వెళ్తోంది. ఇంతలో సమీప అడవిలో నుంచి వచ్చిన ఏనుగు ఆమెను వెంటాడింది. తొండంతో కొట్టి కాళ్లతో తొక్కడంతో అనిత తీవ్ర గాయాలపాలైంది. బాధితురాలు కేకలు వేయడంతో ఏనుగు వెళ్లిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కన్నుమూసింది. బాళెహొన్నూరు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలి కుటుంబానికి తక్షణం పరిహారం అందించాలని గ్రామస్థులు ధర్నా చేశారు.