ఎక్స్‌ప్రెస్‌ హైవేకు కొత్త సొబగులు | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు కొత్త సొబగులు

Jul 25 2025 4:51 AM | Updated on Jul 25 2025 4:51 AM

ఎక్స్

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు కొత్త సొబగులు

మైసూరు: బెంగళూరు– మైసూరు మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌ హైవేలో పలు సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.712 కోట్ల నిధులను విడుదల చేసిందని మైసూరు–కొడగు ఎంపీ యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయర్‌ తెలిపారు. ఈ దశపథ రహదారిలో కొత్తగా ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు, రైలు వంతెనలు, అండర్‌పాస్‌, ఓవర్‌పాస్‌, సర్వీస్‌ రోడ్డు తదితర సదుపాయాలను కల్పిస్తామన్నారు. దశపథ మార్గం ముగిసే మణిపాల్‌ ఆస్పత్రి జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీ నివారించేందుకు పై వంతెనను నిర్మిస్తామన్నారు. కాగా, పంచ గ్యారంటీలతో దివాలా తీసిన రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా చిరు వ్యాపారులపై జీఎస్టీ పన్ను బ్రహ్మాస్త్రం వదిలిందని యదువీర్‌ విమర్శించారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆరోపించారు.

ధర్మస్థలలో సిట్‌ దర్యాప్తు షురూ

బనశంకరి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వివాదానికి తెరలేపిన శ్రీక్షేత్ర ధర్మస్థల చుట్టుపక్కల మహిళల సామూహిక హత్యల ఆరోపణల కేసులో సిట్‌ బృందం గురువారం దర్యాప్తుకు నాంది పలికింది. సిట్‌ చీఫ్‌, డీజీపీ ప్రణవ్‌ మొహంతి, సభ్యులు డీఐజీ ఎంఎన్‌.అనుచేత్‌లు స్థానిక పోలీసు అధికారులతో భేటీ జరిపారు. ఏమి జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాల కోసం తవ్వకాలు జరపాలంటే కోర్టు నుంచి అనుమతుల తీసుకోవడం గురించి చర్చించారు. ఇక్కడ సామూహిక ఘోరాలు జరిగాయని చెబుతున్న మాజీ పౌర కార్మికున్ని కూడా పిలిపించి విచారణ చేపట్టారు. శవాలను పూడ్చిపెట్టారని చెప్పిన స్థలాల్లో సిట్‌ అధికారులు పరిశీలించారు. విచారణలో పోలీసులు ఏమేం చేయాలన్నది సిట్‌ ముఖ్యులు నిర్దేశించారు.

మాదప్పకు అమావాస్య పూజలు

మైసూరు: భీముని అమావాస్య సందర్భంగా చామరాజనగర జిల్లాలో ప్రసిద్ధ మలె మహాదేశ్వర కొండ మీద దేవస్థానానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మలె మహదేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. దేవస్థానంతో పాటు పరిసరాలను విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.

పెళ్లంటూ యువతికి

రూ.3 లక్షల శఠగోపం

మైసూరు: మ్యాట్రిమొని ద్వారా పరిచయం అయిన ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి నుంచి రూ.3.23 లక్షలను వసూలు చేశాడు. వివరాలు.. మైసూరులోని విజయనగర నివాసి, ఇంజినీర్‌ అయిన యువతిని మ్యాట్రిమొని ద్వారా యువకుడు పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుని పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఆ యువకుడు.. అర్జంటు పని ఉంది, డబ్బు పంపితే మళ్లీ ఇచ్చేస్తానని నమ్మించి ఆమె ఖాతా నుంచి రూ.3.23 లక్షలను తన ఖాతాకు బదలాయించుకున్నాడు. తరువాత మొబైల్‌ స్విచాఫ్‌ చేసుకున్నాడు. మోసపోయినట్లు అర్థం కావడంతో ఆమె సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది.

రష్యా మహిళ

బహిష్కారంపై స్టే

బనశంకరి: ఉత్తర కన్నడ జిల్లా కుమటా తాలూకా గోకర్ణ వద్ద కారడవిలో గుహలో నివసిస్తూ పట్టుబడిన రష్యన్‌ మహిళ, ఇద్దరు పిల్లలను దేశం నుంచి బహిష్కరించే చర్యపై హైకోర్టు స్టే విధించింది. 40 ఏళ్ల నీనా కుటినా అనే రష్యన్‌ మహిళ ఇద్దరు చిన్నారి కూతుళ్లతో భారత్‌కు వచ్చింది. గోకర్ణకు చేరుకుని రామతీర్థలో గుహలో నివసిస్తూ ఉండగా ఈ నెల 11వ తేదీన పోలీసులు కనిపెట్టి కాపాడారు. ఆమె వీసా గడువు ముగిసిపోయింది. దేశం నుంచి బహిష్కరిస్తామని ఇచ్చిన నోటీస్‌పై నీనా కుటినా హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. గురువారం విచారించిన న్యాయమూర్తి ఎస్‌.సునీల్‌దత్‌యాదవ్‌.. ఆమెకు అనుకూలంగా స్టే ఇస్తూ, ఆగస్టు 18 కి విచారణ వాయిదా వేశారు.

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు కొత్త సొబగులు  1
1/1

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు కొత్త సొబగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement