
దోపిడీ దొంగలపైకి పోలీసు తూటాలు
హుబ్లీ: చోరీ చేసి పరారీ అవుతున్న ఇద్దర దొంగల కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపారు. విద్యాకాశి ధార్వాడలో సూర్యోదయాన్నే కాల్పుల మోత వినిపించింది. ముజామిల్ సౌదాగర్, విజయ్ అణ్ణిగేరి తుపాకీ కాల్పుల్లో తూటాలు తిన్న నిందితులు. ధార్వాడ విద్యాగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరినగర లే అవుట్‌లో ఓ చోరీ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారవుతుండగా పోలీసులకు చిక్కారు. ఈ క్రమంలో ఎస్‌ఐ మల్లికార్జున, కానిస్టేబుల్ మహమ్మద్ ఇషాక్‌లపై దాడి చేసి తప్పించుకుని పరారయ్యేందుకు దొంగలు ప్రయత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం దొంగల కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన నిందితులు, పోలీసులకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రిలో కమిషనర్ పరిశీలన
కాగా పోలీస్ కమిషనర్ శశికుమార్ ఆస్పత్రికి వెళ్లి పోలీస్ సిబ్బంది, నిందితుల ఆరోగ్యం పట్ల విచారించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాగిరి స్టేషన్ పరిధిలో పోలీస్ ట్రైనింగ్ కళాశాల వద్ద ద్విచక్ర వాహనంలో దూరదర్శన్ ఉద్యోగి రాత్రి 9– 10 గంటల ప్రాంతంలో బస్సు కోసం వస్తుండగా ముగ్గురు దొంగలు ఉన్న ఫళంగా ఆయన్ను అడ్డుకొని దాడి చేశారు. అలాగే అతడి వద్ద ఉన్న బైక్, డబ్బులు లాక్కోడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అలర్ట్ అయిన సదరు ఉద్యోగి దొంగల నుంచి తప్పించుకోవడానికి బైక్‌ను వేగంగా నడుపుకొంటూ తనపై దోపిడీ ప్రయత్నం జరుగుతోందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ధార్వాడ నగరంలోని మూడు పోలీస్ స్టేషన్ల సీఐలు, క్రైం సిబ్బంది తదితరులు అలర్ట్ అయి అక్కడక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకొని వెతకడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఓ నిందితుడు పట్టుబడ్డాడు. అతడి పేరు హుసేన్‌సాబ్ కనవల్లి, ఈయనపై 30–35కు పైగా చోరీలు, దోపిడీలతో పాటు ఇతర నానా రకాల కేసులు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లోనూ కేసుల నమోదు
ఇతడు కేవలం కర్ణాటకకే కాకుండా గోవా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఇతడిని విచారించగా తనతో పాటు దోపిడీ చేయడానికి వచ్చిన వారి గురించి తాము బస చేసే స్థలం చూపిస్తానన్నాడు. ఆ మేరకు ఆ స్థలాన్ని చూపించడానికి తీసుకెళ్లగా అక్కడ ద్విచక్ర వాహనాలు, ఇద్దరు వ్యక్తులు సంచరిస్తు ఉన్నట్లుగా కనబడింది. దీంతో పోలీస్ సిబ్బంది వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా మాతో పాటు ఉన్న నిందితుడు హుస్సేన్ సాబ్ తోసివేసి పరారయ్యారు. మిగతా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితులు చేతికి దొరికిన రాళ్లు, ఇతర వస్తువులతో దాడి చేశారు. దీంతో పోలీసులు ముందుగా మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత రెండు రౌండ్లు ఒక్కొక్క నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో పరారీ కావడానికి కుదరలేదు. ఎట్టకేలకు ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించాం. మా ఇద్దరు సిబ్బందికి గాయాలు అయ్యాయి. ముందు పోలీస్ అదుపులో ఉన్న ఆ తర్వాత పరారయిన హుస్సేన్ సాబ్ కనవల్లి కోసం గాలిస్తున్నామని కమిషనర్ శశికుమార్ వివరించారు.
విద్యా కాశి ధార్వాడలో కాల్పుల మోత
ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన వైనం