
మరాఠిలో రికార్డుల కోరికపై నిరసన
హుబ్లీ: బెళగావి మహానగర పాలికె సమావేశంలో మరాఠిలో రికార్డులు ఇవ్వాలని ఎంఈఎస్ మద్దతు ఉన్న సభ్యుడు రవి సాలుంకే కోరడంపై ఖండన వ్యక్తం చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు పాలికె ఆవరణలో ఆందోళన చేపట్టారు. పాలికె సభామందిరంలో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టగా పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించారు. మరాఠిలో రికార్డులను కోరిన సభ్యుడిని అనర్హుడుగా ప్రకటించాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి.
నేటి నుంచి పాండురంగ ఆలయంలో ప్రత్యేక పూజలు
బళ్లారిఅర్బన్: రాజేశ్వరి నగర్‌లోని విఠల గోంధళి సమాజం ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 8వ వార్షికోత్సవ సప్తాహ పూజా కార్యక్రమాలను విశేషంగా జరుపనున్నారు. ఈ నెల 25న పోతి స్థాపన, ప్రవచనాలు, నామజపం, కీర్తనలు నిర్వహిస్తారు. 26న సాయంత్రం కాకడ హారతి, ఉదయం జ్ఞానేశ్వరి 9, 12వ అధ్యాయ సముదాయ పారాయణం, తర్వాత భజనలు, ప్రవచన, నామజపం, ఆ తర్వాత కన్నడ కీర్తనలు ఆలపిస్తారు. 27న ఉదయం కాకడ హారతి, నగర రాజ వీధిలో సకాల మంగళ హారతితో వెండి పల్లకీ ఉత్సవం బయలుదేరనుంది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు మహా ప్రసాద వినియోగం ఉంటుందని ఆ ఆలయ ప్రధాన నిర్వాహకులు తెలిపారు. సీనియర్ భక్తులు వీ.శంకర్‌రావ్ శాస్త్రి, ఎస్‌ఎన్ శాస్త్రి, వీ.లక్ష్మణరావ్, ఎస్‌బీ గిడ్డప్ప, ఎస్‌వీ శాస్త్రి, వీహెచ్ లక్ష్మణరావ్, వీ.నల్లారెడ్డి, వీ.రంగముని, వీ.శంకర్‌ప్రసాద్ గుడియ, అధ్యక్షుడు ఎస్‌వీ సురేష్ సారథ్యంలో ఆలయ వేడుకలు జరగనున్నాయి.
ఆలయ గోపురం ధ్వంసం
హొసపేటె: హంపీలోని విజయ విఠల ఆలయ దక్షిణ ద్వార గోపురం నుంచి రెండు ఇటుకలు వర్షం కారణంగా కింద పడిపోయాయి. స్వదేశీ, విదేశీ పర్యాటకులు ఈ ద్వారం గుండా బయటకు వస్తున్నారు. ఇప్పుడు కేంద్ర పురావస్తు శాఖ ఈ ద్వారాన్ని తాత్కాలికంగా మూసి వేసింది. హంపీలోని విజయ విఠల ఆలయంలో సప్తస్వర మండపం రాతి స్తంభాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఈ ఆలయంలో స్మారక చిహ్నాలను చూడటానికి స్వదేశీ, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆలయం తూర్పు ద్వారం నుంచి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే పర్యాటకులు దక్షిణ ద్వారం నుంచి బయటకు వస్తారు. ఈ ద్వారం దగ్గర బ్యాటరీతో పని చేసే వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఉంది.
ఎల్‌ఎల్‌సీ కింద రెండో పంటకు నీరివ్వండి
బళ్లారిటౌన్: తుంగభద్ర ఆయకట్టులో రెండవ పంటకు ఎల్‌ఎల్‌సీ కాలువకు నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రకు వినతిపత్రాన్ని సమర్పించి ఆయన మాట్లాడారు. ఈ విషయంపై తుంగభద్ర జలాశయ నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశంలో ప్రస్తావించి రైతుల కష్టాలపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నేత్రదానం శ్రేష్టదానం
హుబ్లీ: దానాల్లో నేత్రదానం శ్రేష్టమైంది, కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌జేఆర్‌వీపీ మండలి అధ్యక్షుడు భవర్‌లాల్ సీ.జైన్ పేర్కొన్నారు. శాంతినికేతన్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన బృహత్ ఉచిత నేత్ర పరీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. కంటి చూపుంటే మాత్రమే మన దైనందిన పనులు చేసుకోవడం సాధ్యం అనే అవగాహన పెంచుకొని కళ్లను కాపాడుకోవాలన్నారు. ఆ ఫోరం సభ్యుడు విశాల్ మెహరా మాట్లాడుతూ మీరు చనిపోయాక మీ కళ్లను దానం చేయడం వల్ల మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చన్నారు. ఇ–మెయిల్ గోఫ్రా మాట్లాడుతూ మొబైల్ వినియోగం, అధికంగా టీవీ చూడటం వల్ల కంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల కంటి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. భవర్‌లాల్ సీ.జైన్‌ను ఘనంగా సన్మానించారు. మునిశ్రీ దిలిప్ కుమార్‌జీ, జ్యోతి ఆస్పత్రి డాక్టర్ సౌరబ్ ఒడయర్, వినోద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరాఠిలో రికార్డుల కోరికపై నిరసన

మరాఠిలో రికార్డుల కోరికపై నిరసన