
కాలే కడుపు.. అన్నం కరువు
సాక్షి, బెంగళూరు: కన్నడనాట బాలల అపౌష్టికత ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సమీక్ష ప్రకారం 1.10 లక్షల మంది బాలల పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. పిల్లల్లో పౌష్టికత పెంపుదల కోసం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గుడ్లు, పాల పంపిణీతో పాటు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ లోపం కనుమరుగు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం పేదరికంతో పాటు నిరక్షరాస్యత, అధికారుల అలసత్వం.
ఆ నాలుగు జిల్లాల్లో
పౌష్టికత గురించి 2024–25 ఏడాదిలో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీక్ష నిర్వహించింది. సుమారు 30.87 లక్షల మంది బాలలకు మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఇందులో 1.10 లక్షల మంది బాలలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేరు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అందులోనూ బీదర్, విజయనగర, రాయచూరు, బళ్లారి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. బరువు తక్కువతో పాటు తరచుగా అనారోగ్యాలు వస్తాయి, శారీరక, మానసిక వికాసం లోపించి చదువు, ఆటల్లో వెనుకబడతారు. ఇలా పోటీయుగంలో బాధిత బాలలు అన్ని విధాలా నష్టపోతున్నారు.
విజయనగర ప్రథమం
మరో 9,526 మందిలో తీవ్రమైన పౌష్టికాహార లోపం ఉన్నట్లు గుర్తించారు. కొత్తగా ఏర్పడిన విజయనగర జిల్లా అగ్రస్థానంలో ఉండడం విషాదకరం. ఈ జిల్లాలో 97,947 బాలలను పరీక్షించగా అందులో 5,413 (5.53 శాతం) మందిలో సాధారణ స్థాయిలో, 1,184 (21 శాతం) మందిలో తీవ్రమైన స్థాయిలో పౌష్టికాహార లోపం కనిపించింది. ఇక ఆ తర్వాత స్థానాల్లో బీదర్, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలు ఉన్నాయి.
నివారణకు సూచనలు
పిల్లల్లో అపౌష్టికతను దూరం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మహిళా, శిశు సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. శిశు సంక్షేమ సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశాలు బాధిత పిల్లలపై అత్యధిక నిఘా ఉంచాలని సూచించింది. జిల్లాస్థాయి అధికారులు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం పోషణ్ ట్రాకర్‌ను అనుసరించాలి. పిల్లలను పరిశీలిస్తూ, వారి బరువులను తూకం వేస్తూ పౌష్టికాంశ పునర్వసతి కేంద్రానికి పంపించాలని సూచించింది. అపౌష్టికత, టీకాల శాతం, బాలల ఇళ్లల్లో సరైన వసతులు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ సూచించింది.
సరదాగా, సంతోషంగా సాగాల్సిన బాల్యాన్ని పేదరికం చిదిమేస్తోంది. కనీస ఆహారం అందక ఆ కుటుంబాల బాలలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. ఓవైపు గోదాముల్లో లక్షల టన్నుల బియ్యం, గోధుమలు మగ్గిపోతుంటే బాలల కడుపులు ఆకలితో అల్లాడుతున్నాయి. ఉత్తర కర్ణాటకలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో వారిలో శారీరక, మానసిక వికాసమూ కుంటుపడుతోంది.
రాష్ట్రంలో లక్ష మందికి పైగా బాలల్లో పౌష్టికాహార లోపం
ప్రభుత్వ సర్వేలో తేలిన నిజం

కాలే కడుపు.. అన్నం కరువు