
విద్యుదాఘాతానికి ముగ్గురు బలి
సాక్షి,బళ్లారి: ఇనుప స్తంభాన్ని పాతుతుండగా విద్యుత్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందిన హృదయ విదారక ఘటన బుధవారం చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా కాళఘట్ట గ్రామంలో జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన వక్కతోటలో షెడ్డు నిర్మాణం చేపడుతున్న సమయంలో ఆ స్థలం మీదుగా వెళ్లిన విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు తగలడంతో కార్మికులు ఫారూక్(30), నజీర్(30), శ్రీనివాస్(35) అనే ముగ్గురు తీవ్ర గాయాలకు గురి కాగా, తక్షణం వారిని దావణగెరెలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొట్ట కూటి కోసం కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ ఘటనపై చిక్కజాజూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
గదగ్, చిత్రదుర్గ జిల్లాల్లో వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందడంతో పాటు నలుగురికి గాయాలయ్యాయి. బుధవారం బళ్లారి నుంచి బెంగళూరుకు కారులో వెళుతుండగా హిరియూరు వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో కారు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో బళ్లారి నగరానికి చెందిన కోరి సురేష్(46) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి గాయపడిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో కోరి సురేష్ మృతి వార్త తెలియగానే నగరంలోని ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య రుక్మిణి, కుమార్తె వినిత, కుమారుడు వినయ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల రోదనలు ఆపేందుకు ఎవరి తరమూ కాలేదు. అలాగే గదగ్ జిల్లాలో ద్విచక్ర వాహనంలో నలుగురు వెళుతుండగా ముండరగి వద్ద డివైడర్‌కు బైక్ ఢీకొని అక్కడికక్కడే నేరళగంటి (36) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మహిళతో పాటు చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలపై ఆయా జిల్లాలకు చెందిన అక్కడి పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె
తాలూకాలో ఘోరం
మృతులందరూ కూలి పని
చేసుకునే కార్మికులే

విద్యుదాఘాతానికి ముగ్గురు బలి

విద్యుదాఘాతానికి ముగ్గురు బలి

విద్యుదాఘాతానికి ముగ్గురు బలి