
రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేయండి
హొసపేటె: జిల్లా వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో రోడ్లపై రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రమాద స్థలాలను గురించి శాసీ్త్రయంగా వేగనిరోధకాలను ఏర్పాటు చేయాలని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ పీడబ్ల్యూడీ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని తన కార్యాలయ సభాంగణంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రతా సమితి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పట్టణాల్లో వాహనాలు వేగంగా వెళుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వేగాన్ని నియంత్రించడానికి చిన్న చిన్న వేగనిరోధకాలను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల రోడ్లతో సహా పెద్ద సంఖ్యలో వాహనాలు ఉన్న రోడ్లను గుర్తించాలన్నారు. అనేక ప్రమాదాల్లో మరణాలు సంభవించినందున వాహనాల వేగాన్ని నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్లపై నీరు నిల్వ చేరకుండా చర్యలు
హొసపేటె నగరంలో వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిలుస్తోంది. రోడ్డుపై ఉన్న నీరు కాలువల్లోకి సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిలో హొసహళ్లి దగ్గర 300 మీటర్ల పొడవున రోడ్డు డ్రైన్ నిర్మించాలని ఆయన సూచించారు. అరసీకెరె నుంచి మత్తిహళ్లి వరకు ఉన్న రెండు కిలోమీటర్ల రోడ్డు మొత్తం వాహనాలు తిరగడానికి వీలు లేకుండా పోయింది. మరియమ్మనహళ్లి, డణనాయకనకెరె, దేవలాపుర, గొల్లరహళ్లి సమీపంలోని మూడు రోడ్ క్రాసింగ్‌ల వద్ద ఎన్‌హెచ్‌ఏఐ లైట్లు, రోడ్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం వర్షం కారణంగా రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో పీడబ్ల్యూడీ శాఖ అధికారుల పాత్ర పెరిగిందన్నారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని రోడ్లను నిర్లక్ష్యం చేయవద్దని, పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అధికారుల సలహా సూచనలు పాటించాలి
సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి మాట్లాడుతూ ఏదైనా రోడ్డుపై రోడ్ బ్లాక్ ఏర్పాటు చేసే ముందు ప్రజా పనుల శాఖ అధికారులు సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సలహా తీసుకోవాలని అన్నారు. నగరంలోని ప్రధాన సర్కిళ్ల వద్ద సిగ్నల్ బోర్డులు, రోడ్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలన్నారు. భట్రహళ్లి ఆంజనేయ ఆలయానికి వెళ్లే రహదారిలో చాలా మలుపులు ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. జాతీయ రహదారిపై పాపినాయకనహళ్లి, వడ్డరహళ్లిలోని రోడ్లపై చాలా గుంతలు ఉన్నాయి. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. హై వేలపై ప్రమాదాల నివారణకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. అనంతశయనగుడి రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో తాత్కాలికంగా రోడ్డు రాకపోకలకు అనుమతించినా రహదారి కూడా దెబ్బతింది.
వాహన రాకపోకలకు సమస్య
బైక్‌లు, ఆటోలు, కార్లు తదితర వాహన రాకపోకలకు సమస్యగా ఉంది. రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. జిల్లాధికారి కార్యాలయం ముందు రోడ్డును దాటుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని అన్నారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మాట్లాడుతూ జాతీయ రహదారిపై మొత్తం 6 బ్లాక్ స్పాట్‌లను గుర్తించామన్నారు. 5 బ్లాక్ స్పాట్‌లకు ఇప్పటికే మరమ్మతులు చేశామన్నారు. మిగిలిన 1 బ్లాక్ స్పాట్‌ను వీలైంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. రవాణా శాఖ, పీడబ్ల్యూడీ, ఎన్‌హెచ్‌ఏఐ సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజాపనుల శాఖ అధికారులకు
జిల్లాధికారి దివాకర్ సూచన