
ఫేక్ న్యూస్‌తో పత్రికా రంగానికి చేటు
బళ్లారిటౌన్: ఊహాజనిత వార్తలు, ఫేక్ న్యూస్, ఆధునిక పరిజ్ఞాన దుర్వినియోగం వల్ల సమాజంపై ప్రమాదకర ప్రభావం చూపుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మాధ్యమ సలహాదారుడు కేవీ.ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయం ఆవరణలోని గాంధీభవన్‌లో కర్ణాటక రాష్ట్ర వర్నింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పత్రికా దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఊహాగాన వార్తలతో కొంత మంది సంతోష పడవచ్చని, అయితే ఇది సమాజానికి మంచిది కాదన్నారు. ఫేక్ న్యూస్‌లను సమర్థించుకోవడం, సోషల్ మీడియా ద్వారా రాజకీయ నేతలను ఎద్దేవా చేయడం సరికాదన్నారు.
రాజ్యాంగ పరిధిలో పని చేయాలి
విలేకరులు రాజ్యాంగ పరిధిలో పని చేయాల్సి ఉంటుందన్నారు. తప్పుడు వార్తలను నియంత్రించేందుకు త్వరలో జరిగే సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొనేలా యోచిస్తున్నట్లు తెలిపారు. గతంలో విలేకరులు ఎంతో ప్రామాణికతతో పని చేసేవారన్నారు. అయితే నేడు ఆ ప్రామాణికత మృగ్యం అవుతోందని విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగం విలువలను కాపాడే రీతిలో పని చేస్తున్న పార్ట్‌టైమ్ గ్రామీణ విలేకరులకు కూడా బస్సు పాస్ సదుపాయాన్ని కల్పించామన్నారు. మాధ్యమ సంజీవిని పథకాన్ని అమలు చేశామన్నారు.
విలేకరులకు స్థలాలు అందిస్తాం
విలేకరులకు స్థలాలు అందించే ప్రయత్నం కూడా చేస్తామని హామీ చేశారు. రాష్ట్రంలో సమాచార శాఖకు 14 కొత్త వాహనాలు అందిస్తున్నట్లు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు మాట్లాడుతూ తమ చిరకాల విలేకరులకు బస్సు పాస్ సదుపాయం కోసం చేసిన పోరాటం, కృషి ఫలించిందన్నారు. రానున్న రోజుల్లో పార్ట్‌టైమ్ విలేకరులకు కూడా పింఛన్ కల్పించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దశల వారీగా విలేకరుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. సమాజంలో బ్లాక్ మెయిల్ విలేకరుల మాఫియా, తప్పుడు వార్తలు రాసేవారు ఈ పత్రికా రంగం నుంచి దూరం ఉంటే మంచిదన్నారు.
ప్రామాణిక విలేకరులకు గుర్తింపు
తద్వారా ప్రామాణిక విలేకరులకు ఎంతో గుర్తింపు వస్తుందన్నారు. దావణగెరె యూనివర్సిటీ పత్రికోద్యమ నేత శివకుమార్ కణసోగి మాట్లాడుతూ నేటి పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఉపన్యసించారు. అనంతరం 10వ తరగతి, పీయూసీల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఇటీవల క్రికెట్ పోటీల విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. మేయర్ ముల్లంగి నందీష్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కార్యదర్శి లక్ష్మీనారాయణ, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్, సోమశేఖర్ కెరెగోడు, జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, వార్తాధికారి బీవీ.తుకారాం, కార్యవర్గ సభ్యుడు వీరభద్రగౌడ పాల్గొన్నారు.
సమాజంపై ప్రమాదకర ప్రభావం
సీఎం మీడియా అడ్వైజర్ ప్రభాకర్