
నలుగురు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల అరెస్ట్
హుబ్లీ: కలబుర్గి జిల్లా శహాబాద్ నగరం ధక్కా తాండాలో బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను శహాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 135 గ్రాముల బంగారు ఆభరణాలు, 550 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదు మొత్తం కలిపి రూ.8.95 లక్షల విలువ చేసే ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీకి వాడిన 5 చాకులను కూడా జప్తు చేసుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. శహాబాద్ ధక్కా తాండా నివాసి రవిశంకర్ రాథోడ్ (42), అక్కలకోటె శివాజీ నగర తాండా నివాసి మహదేవ రాథోడ్(38), క్యాదపుర తాండా నివాసి శివకుమార్ రాథోడ్(25), అనగేరి గోపాలనాయక్ (30) అరెస్ట్ అయిన నిందితులు. మరో నిందితుడు సునీల్ బాబు రాథోడ్ తప్పించుకొని పరారు కాగా అతడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టామన్నారు.
చీరలతో చేతులు, కాళ్లు కట్టి..
గత నెల 22న రాత్రి 1.30 గంటలకు శహాబాద్ నగర ధక్కా తాండా హనుమంత పాండు పవార్ ఇంట్లోకి చొరబడిన హనుమంత, ఆ ఇంట్లో ఉన్న వారిని చీరలతో చేతులు, కాళ్లు కట్టి చాకులు, కత్తులు చూపించి ఇంట్లో ఉన్న సదరు మొత్తం రూ.15,26,500 విలువ చేసే ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. ఘటనపై శహాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. దర్యాప్తు కోసం ఏఎస్పీ మహేష్ మేఘణ్ణవర, డీఎస్పీ శంకర్‌గౌడ పాటిల్, సీఐ నటరాజ్ నేతృత్వంలో ఎస్‌ఐ శమరాయ, ఏఎస్‌ఐలు మల్లికార్జున, గుండప్ప, సిబ్బంది నాగేంద్ర, మల్లికార్జున, బలరామ, సంతోష, హుస్సేన్‌పాషా తదితరులతో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందం ఈ నెల 3న మహారాష్ట్రలోని అక్కలకోటె వద్ద హైవేలో నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఇంతకు ముందు జేవర్గి తదితర చోట్ల దోపిడీ కేసులు నమోదు అయ్యాయని వివరించారు. కాగా ఈ బందిపోటు దొంగల ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన శ్వానదళ బృందం సేవలను ఎస్పీ ప్రశంసించారు.
మహిళ ఆత్మహత్య
మరో ఘటనలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హుబ్లీ కృష్ణాపుర వీధి నివాసి మహిజబీన్ బంకాపుర(39) తన ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులను తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని మహిళా స్టేషన్ పోలీసులు తెలిపారు.
రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
కలబుర్గి జిల్లా ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు వెల్లడి