
ఆస్పత్రిలో శిశువుల మార్పిడి కలకలం
రాయచూరు రూరల్: తాలూకా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో శిశువుల మార్పిడి చోటు చేసుకుంది. సింధనూరు తాలూకా గాంధీనగర్‌కు చెందిన రేవతి అస్పత్రిలో మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఈ విషయంలో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులు రేవతి ఆస్పత్రిలో మగ పిల్లవాడికి జన్మనివ్వలేదు, ఆడ శిశువుకు జన్మనిచ్చావంటూ ఆమెకు ఆడ శిశువును అందించడంతో ఆమె దిగులు చెందింది. తనకు పుట్టిన శిశువు మగ బిడ్డని చెప్పిన వైద్యులు, నర్సులు అర గంటలోనే శిశువులను మార్పు చేశారని, తనకు న్యాయం చేయాలని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తమకు మగ బిడ్డను ఇవ్వాలని వాదిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సింధనూరు తాలూకా ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, నర్సులు నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తున్నట్లు వారు ఆరోపించారు.
తాగుడుకు డబ్బివ్వనందుకు భార్య హత్య
●నిందితునికి యావజ్జీవ కారాగారం, రూ.50 వేల జరిమానా
సాక్షి,బళ్లారి: తాగుడుకు డబ్బులు ఇవ్వనందుకు భార్యను చంపిన భర్త కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ కలబుర్గి ఐదవ జిల్లా సెషన్స్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. వివరాలు.. కలబుర్గి తాలూకా కురనళ్లి గ్రామానికి చెందిన మహంతప్పకు అదే గ్రామానికి చెందిన మల్కప్ప కట్టెమని కుమార్తె సంగీతను ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే తాగుడుకు బానిసైన మహంతప్ప ప్రతి నిత్యం డబ్బుల కోసం భార్యను వేధిస్తుండేవాడు. 2023లో డిసెంబర్ 26న భార్యాభర్తల మధ్య గొడవ పతాకస్థాయికి చేరడంతో తాగుడుకు డబ్బులు ఇవ్వనందుకు మహంతప్ప భార్యను కొట్టి చంపాడు. ఈ ఘటనపై భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. కేసు పూర్వాపరాలు విచారించిన న్యాయస్థానం నిందితుడికి పైమేరకు జైలు శిక్ష విధించింది.
రాయచూరు వర్సిటీకి రూ.34 కోట్ల విడుదల
రాయచూరు రూరల్: ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయానికి రూ.34 కోట్ల నిధులు కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి విడుదల అయ్యాయని ఆ వర్సిటీ వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని తెలిపారు. మంగళవారం వర్సిటీ సభాభవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీ పరిధిలో 56,343 మంది విద్యార్థులున్నారన్నారు. 20 శాఖలు పని చేస్తున్నాయన్నారు. 80 మంది అతిథి అధ్యాపకులు, 90 మంది తాత్కాలిక ఉద్యోగులు కూడా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కొత్త కోర్సులను ప్రవేశ పెడతామన్నారు. రిజిస్ట్రార్లు చెన్నప్ప, జ్యోతి డీ.ప్రకాష్, ఆర్థిక అధికారి వెంకటేష్, సుయమీంద్ర కులకర్ణిలున్నారు.
వీధి కుక్కలు, పశువుల బెడద అరికట్టరూ
రాయచూరు రూరల్: నగరంలో అధికమైన వీధి కుక్కలు, పఽశువుల బెడద నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్టూడెంట్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డీపీఐ) డిమాండ్ చేసింది. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మీర్జా హసన్ బేగ్ మాట్లాడారు. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు పిల్లలను కరుస్తున్నాయని ఆరోపించారు. రహదారుల్లో ఆవులు విశ్రమించడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతూ నగరసభ అధికారికి వినతిపత్రం సమర్పించారు. అక్బర్, మతీన్, తౌసిఫ్, మహ్మద్ ఫారూక్, సైదాబేగం, షేక్, ఎం.గౌస్‌లున్నారు.
నగర బీజేపీ అధ్యక్షుడుగా నియామకం
బళ్లారి టౌన్: నగర బీజేపీ నూతన అధ్యక్షుడుగా మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ నేత అరుణ్ షాపూర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో వెంకటరమణ మాత్రమే నామినేషన్ సమర్పించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు అనిల్ నాయుడు, ఎమ్మెల్సీ సతీష్, నాయకులు కేఎస్ దివాకర్, ఓబుళేసు ఆధ్వర్యంలో బాధ్యతలను స్వీకరించారు.

ఆస్పత్రిలో శిశువుల మార్పిడి కలకలం

ఆస్పత్రిలో శిశువుల మార్పిడి కలకలం

ఆస్పత్రిలో శిశువుల మార్పిడి కలకలం