
పారిశుధ్య కార్మికుల ర్యాలీ
హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దళిత హక్కుల కమిటీ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలోని క్రియాశక్తి భవనం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత కమిటీ నేత జంబయ్య నాయక్ మాట్లాడుతూ వందలాది ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు కన్నడ విశ్వవిద్యాలయం స్థాపన కోసం తమ భూములను చాలా తక్కువ ధరకు ఇచ్చారు. మరికొందరు తమ భూములను ఉచితంగా ఇచ్చారు. అటువంటి ఎస్సీ, ఎస్టీ పేద రైతులు, వారి పిల్లలు, బంధువులు, వెనుకబడిన తరగతులు, దళిత సమాజానికి చెందిన 48 మంది గత 15–20 ఏళ్లుగా పారిశుధ్య కార్మికులుగా తక్కువ వేతనాలకు కన్నడ విశ్వవిద్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరు గత 11 నెలలుగా వేతనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారన్నారు. అనంతరం వినతిపత్రాన్ని వర్సిటీ వైస్ ఛాన్సలర్ పరశివమూర్తికి అందజేశారు.