
లంచగొండి మంత్రి రాజీనామా చేయాలి
బళ్లారిటౌన్: మఠాలకు మంజూరైన నిధుల విడుదలకు 20 నుంచి 25 శాతం లంచం డిమాండ్ చేసిన మంత్రి శివరాజ్ తంగడిగి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ వైఎం సతీష్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 2022లో నాగప్రసన్న విశ్వ గాణిగర ట్రస్ట్ అభివృద్ధికి అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై రూ.3.5 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.2 కోట్లు ఆనాడే విడుదల అయ్యాయని, మిగిలిన రూ.1.5 కోట్లు బాకీ ఉండగా ఈ ప్రభుత్వంలో వాటి విడుదల కోసం కాలయాపన చేశారన్నారు. దీనిపై ఈఏడాది మార్చిలో కోర్టును ఆశ్రయించగా నెలలోగా మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని, ఆలస్యం అయితే 6 శాతం జరిమానాతో కలిపి చెల్లించాలని కూడా ఆదేశించిందన్నారు. అయితే కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా సాగదీస్తూ వస్తున్నారన్నారు. ఇందులో 25 శాతం కమీషన్ ఇస్తేనే నిధులు ఇస్తామని మంత్రి సహచరులు అంటున్నారన్నారు.
ఆనాడే నిధుల విడుదల
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి రూ.1.5 కోట్లు, గవియప్ప సర్కిల్ వద్ద గల శ్రీరామ మందిరం కోసం రూ.50 లక్షలను ఆనాడే మంజూరు చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు సగం మొత్తం మాత్రమే విడుదల చేసి మిగిలిన మొత్తాన్ని విడుదల చేయడానికి కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఇటీవల దేవస్థానం కోసం రూ.5 కోట్ల నిధులు సమకూర్చినట్లు ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ నిధులు ఏయే దేవస్థానాలకు ఇచ్చారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ జిల్లాధ్యక్షుడు అనిల్‌నాయుడు, రాయకులు కేఎస్ దివాకర్, వెంకటరమణ, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు.