డీకే శివకుమార్‌ సీఎం కాలేరు | - | Sakshi
Sakshi News home page

డీకే శివకుమార్‌ సీఎం కాలేరు

Jul 10 2025 6:49 AM | Updated on Jul 10 2025 6:49 AM

డీకే శివకుమార్‌ సీఎం కాలేరు

డీకే శివకుమార్‌ సీఎం కాలేరు

బళ్లారి అర్బన్‌: సీఎం సిద్దరామయ్య సీజనల్‌ పొలిటీషియన్‌తో పాటు మేధావి రాజకీయ నాయకుడని, ఆయన ఎట్టి పరిస్థితిలోను తాను అట్టిపెట్టుకున్న సీఎం స్థానాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేరు, దీంతో డీకే.శివకుమార్‌ సీఎం అయ్యే ప్రసక్తే లేదని మాజీ మంత్రి శ్రీరాములు జోస్యం చెప్పారు. ఆయన తమ నివాసంలో స్థానిక మీడియాతో మాట్లాడారు. గతం 30 నెలల నుంచి కాంగ్రెస్‌ సర్కారు అధికారంలో ఉంది. వీరి హయాంలో ఏ అభివృద్ధి జరగలేదు. కేవలం గ్యారెంటీ గ్యారెంటీ అంటూ తమ ప్రభుత్వానికి గ్యారెంటీ లేకుండా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. డీకే.శివకుమార్‌ సీఎం కుర్చీ కోసం, అలాగే సీఎం సిద్దరామయ్య ఆ పదవిని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని సిద్దు సర్కారుపై శ్రీరాములు మండిపడ్డారు.

దళిత సీఎం పేరుతో డీకేశికి చెక్‌

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సుర్జేవాలా గత వారంలో రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారు. సీఎం మార్పు డిమాండ్‌ తీవ్రత పెరగడంతో రాష్ట్ర రాజకీయాలను అతుకుల బొంతలా మార్చి వెళ్లిపోయారన్నారు. శివకుమార్‌ సీఎం కుర్చీ కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి అనివార్యంగా పోరాటం చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూలిపోతుందన్న శ్రీరాములు, ఇది తాను చెప్పే జోస్యం కాదు, నగ్న సత్యం అని అభివర్ణించారు. దళిత సీఎంను తెరపైకి తెచ్చి శివకుమార్‌ను అణచివేసే కుట్ర జరిగిందన్నారు. దళిత సీఎంకు తమ అభ్యంతరం ఏమీ లేదు. అయితే కుర్చీల కొట్లాటలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకూడదన్నారు. తమ స్వపక్ష ఎమ్మెల్యేలే సర్కారును నిధుల కోసం దేబిరించే పరిస్థితి గత 30 నెలల్లో చాలాసార్లు చూశామన్నారు. పలువురు ఎమ్మెల్యేలు గ్యారెంటీలను పక్కన పెట్టి తమకు నిధులు ఇవ్వాలని వేడుకుంటున్నారన్నారు.

రాష్ట్ర ఖజానా దివాలా

రాష్ట్రానికి ఈ దుర్గతి రాకుండా ఉండాల్సింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులకు షూ, సాక్స్‌ ఇవ్వడానికి ప్రభుత్వం దాతలను వెతుకుతోందన్నారు. అలాగే అజీమ్‌ ప్రేమ్‌జీ ఇచ్చిన గుడ్లను వారానికి 6 రోజుల పాటు పంపిణీ చేయకుండా కేవలం మూడు రోజులకే పరిమితం చేశారన్నారు. దాతలు ఇచ్చిన నిధులను కూడా స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 10 పాలికె ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు. దీంతో సదరు ఉద్యోగులు గత రెండు రోజుల నుంచి ఆందోళన చేపట్టారన్నారు. అన్ని శాఖలు కూడా దివాలా తీశాయన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి చేతకాక పోతే రాజీనామా చేస్తే తాము ఎన్నికలకు సిద్ధం అన్నారు. పార్టీ ప్రముఖులు వీరశేఖర్‌రెడ్డి, ఓబులేష్‌, భీమన్న, కార్పొరేటర్లు రేణుక మల్లనగౌడ, కే.హనుమంతప్ప, గుడిగంటి హనుమంతప్ప, వెంకటరామిరెడ్డి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి శ్రీరాములు జోస్యం

మధ్యంతర ఎన్నికలకు మేం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement